బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ నిషేధానికి వ్యతిరేకంగా మహువా మోయిత్రా, జర్నలిస్టు ఎన్ రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, న్యాయవాది ఎంఎల్ శర్మ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ఆ డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. డాక్యుమెంటరీపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని, దానిపై నిషేధం ఎత్తివేయడమే కాకుండా, భవిష్యత్‌లో కూడా సెన్సార్ లేకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.
మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలి: సుప్రీంకోర్టు
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది. తదుపరి విచారణలో నిషేధానికి సంబంధించిన ఉత్తర్వుల ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. జనవరి 21న బీబీసీ డాక్యుమెంటరీ వీడియో లింకులు, ట్విట్టర్ పోస్ట్‌లను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. డాక్యుమెంటరీని స్క్రీనింగ్ చేసిన విద్యార్థులను శిక్షించే అంశాన్ని చర్చించడాన్ని ధర్మాసనం నిరాకరించింది. అది కేవలం ఇది న్యాయపరమైన వాదనలకే పరిమితమవుతుందని పేర్కొంది.