బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టులో విచారణ
ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ఆ డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. డాక్యుమెంటరీపై నిషేధం దుర్మార్గమైనదని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. డాక్యుమెంటరీ లింక్‌లతో కూడిన ట్వీట్లను తొలగించడంపై సీనియర్ జర్నలిస్టు రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లను ఒకే జాబితాలోకి చేర్చి ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టు విచారించనుంది.
డాక్యుమెంటరీలోని రెండు ఎపిసోడ్లను సుప్రీంకోర్టు పరిశీలించాలి: పిటీషనర్
మోదీపై బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీలోని రెండు ఎపిసోడ్లను పరిశీలించాలని తన ప్రజా ప్రయోజన వ్యాఖ్యంలో ఎంఎల్ శర్మ పేర్కొన్నారు. అలాగే 2002 గుజరాత్ అల్లర్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వ్యక్తులపై చర్య తీసుకోవాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 6న విచారించనుంది. రామ్, భూషణ్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై సీనియర్ న్యాయవాది సియు సింగ్ స్పందించారు. ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించి రామ్, భూషణ్ చేసిన డాక్యుమెంటరీ ట్వీట్లను ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసినందుకు అజ్మీర్‌లోని విద్యార్థులను రస్టికేట్ చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.