హెచ్‌సీయూలో ఉద్రిక్తత: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ vs కాశ్మీర్ ఫైల్స్ ప్రదర్శించిన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐ, కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ఏబీవీపీ పోటీ పడి మరీ ప్రదర్శించడంతో హెచ్‌సీయూలో మరోసారి వివాదం రాజుకుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాత్రి మోదీపై బీబీసీ రూపొందించిన 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' డాక్యుమెంటరీ రెండు సిరీస్‌లను ఎస్ఎఫ్ఐ ప్రదర్శించింది. యూనివర్సిటీ అధికారుల అనుమతి లేకుండా డాక్యుమెంటరీని ప్రదర్శించడంపై ఏబీవీపీ నాయకులు అసహనం వ్యక్తం చేసి డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీబీసీ డాక్యుమెంటరీకి కౌంటర్‌గా ఏబీవీపీ నాయకులు 'ది కాశ్మీర్ ఫైల్స్' స్క్రీనింగ్‌ను నిర్వహించారు. ఈ సమయంలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ నాయకులు పోటీ పడి మరీ నినాదాలు చేయడంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
సోషల్ మీడియాలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ పోస్టులు
డాక్యుమెంటరీ స్క్రీనింగ్ విజయవంతమైందని, 400మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు ఎస్ఎఫ్ఐ తన సోషల్ మీడియా హాండిల్‌లో పేర్కొంది. ఏబీవీపీ తప్పుడు ప్రచారాలు, అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని అందులో ఆరోపించింది. భావప్రకటనా స్వేచ్ఛ, క్యాంపస్ ప్రజాస్వామ్యం కోసం నిలబడిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ-హెచ్‌సీయూ సెల్యూట్ చేస్తుందని చెప్పింది. యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా ప్రదర్శనను నిలిపివేయడానికి ప్రయత్నించినట్లు ఏబీవీపీ ఆరోపించింది. మెయిన్ గేట్‌నుంచి ప్రొజెక్టర్‌ని తీసుకువస్తున్నప్పుడు యూనివర్సిటీ సెక్యూరిటీ తమ నాయకులను అడ్డుకున్నట్లు ఏబీవీపీ-హెచ్‌సీయూ సోషల్‌మీడియా హ్యాండిల్‌లో పేర్కొంది. తమ ప్రొజెక్టర్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించినట్లు వివరించింది. స్క్రీనింగ్ సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, రిజిస్ట్రార్ పేర్కొన్నారు. క్యాంపస్‌లోని భద్రతా అధికారులు తమ కార్యకర్తలపై దాడి చేశారని ఏబీవీపీ ఆరోపించింది.