హెచ్‌సీయూలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన, యూనివర్సిటీ అధికారులకు ఏబీవీవీ ఫిర్యాదు
ప్రధాని మోదీ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తాజాగా ఈ వివాదాస్పద విషయం హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి చేరుకుంది. బీబీసీ విడుదల చేసిన 'ఇండియా: మోదీ క్వశ్చన్' డాక్యుమెంటరీని హెచ్‌సీయూలో కొందరు విద్యార్థులు ప్రదర్శించినట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు యూనివర్సిటీకి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై స్పందించిన యూనివర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని రూపొందించింది. ప్రస్తుతం మొదటి ఎపిసోడ్ విడుదల కాగా, కేంద్రం ఆ వీడియోపై నిషేధం విధించింది.
రెండు రోజుల ముందే యూనివర్సిటీలో ప్రదర్శించాం: విద్యార్థులు
బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించిన విద్యార్థులు ఏబీవీపీ ఫిర్యాదుపై స్పందించారు. బీబీసీ డాక్యుమెంటరీ యూట్యూబ్ లింకులను శనివారం కేంద్రం బ్లాక్ చేయగా, ఆదివారం యూనివర్సిటీలో ప్రదర్శించినట్లు ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. అయితే తాము కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయడానికి రెండు రోజుల ముందే యూనివర్సిటీలో ప్రదర్శించినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. 2002లో గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వర్గం రైలును తగలబెట్టి, 59 మంది హిందూ యాత్రికులను సజీవ దహనం చేశారు. అనంతరం గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగగా, అప్పుడు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఈ మారణహోమంలో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1,050 మంది ప్రాణాలు కోల్పోయారు.