ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం
ప్రధాని మోదీపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై తీవ్ర దుమారం రేగుతోంది. భారత ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్‌గా స్పందిస్తోంది. బ్రిటన్ పార్లమెంట్‌లో కూడా డాక్యుమెంటరీపై చర్చ జరిగింది. తాజాగా డాక్యుమెంటరీలో మొదటి ఎపిసోడ్‌ను బీబీసీ ప్రసారం చేసింది. అయితే ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో లింక్ ను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి. ట్విట్టర్ ద్వారా డాక్యుమెంటరీ యూట్యూబ్ వీడియో లింకులు విపరీతంగా షేర్ అవుతున్న నేపథ్యంలో వాటిపై కేంద్రం ఆంక్షలు విధించింది. యూట్యూబ్ వీడియోలకు లింక్‌లను కలిగి ఉన్న 50కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాల్సిందిగా ట్విట్టర్‌కు సూచించింది.
'డాక్యుమెంటరీ భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేలా ఉంది'
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని రూపొందించింది. మొదటి ఎపిసోడ్ తాజాగా విడుదల కాగా, కేంద్ర హోం మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు చూశారు. దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నించినట్లు డాక్యుమెంటరీ ఉందని వారు చెప్పారు. అపఖ్యాతితో కూడుకున్న డాక్యుమెంటరీ ఈ కథనంగా దీన్ని కేంద్రం ప్రభుత్వం అభివర్ణించింది. ఈ డాక్యుమెంటరీ భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇతర దేశాలతో భారత్ స్నేహపూర్వక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే తాజా ఎపిసోడ్ ఉన్నట్లు తెలిపాయి.