బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు
ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని దిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయగా, ఆ సమయంలో గందరగోళం నెలకొంది. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన నేపథ్యంలో ఆర్ట్స్ ఫ్యాకల్టీ భవనం వెలుపల రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యుల కమిటీని యూనివర్సిటీ వీసీ ఏర్పాటు చేశారు. జనవరి 30 సాయంత్రం 5 గంటలలోపు వీసీకి ఈ కమిటీ నివేదకను సమర్పించనుంది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని రూపొందించింది. అడాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది.
24 మంది విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు
దిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్‌యూఐ, ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీని ప్రకటించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌లో 144సెక్షన్ విధించారు. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ భవనం ఎదుట రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ)కి చెందిన 24 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, బయటి వ్యక్తులు క్యాంపస్‌లో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నించినట్లు యూనివర్సిటీ అధికారులు అనుమానిస్తున్నారు.