Elon Musk: భద్రతా మండలిలో భారత్‌కు చోటు దక్కకపోవడం విడ్డూరం: ఎలాన్ మస్క్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వంపై టెస్లా వ్యవస్థాపకుడు, ట్విట్టర్( ఎక్స్) ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభించకపోవడం చాలా విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయన భారత్‌కు మద్దతుగా నిలిచారు. ఐక్యరాజ్య సమితిని సంస్కరించాల్సిన అవసం ఉందని మస్క్ అభిప్రాయపడ్డారు. అలాగే ఆఫ్రికా కూడా కూడా శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉండాలన్నారు. అమెరికన్-ఇజ్రాయెల్ వ్యాపారవేత్త మైఖేల్ ఐసెన్‌బర్గ్ ట్వీట్‌కు మస్క్ పై విధంగా స్పందించారు. తొలుత భద్రతా మండలిలో ఏ ఆఫ్రికన్ దేశం శాశ్వత సభ్యదేశంగా లేకపోవడంపై ట్విట్టర్ వేదికగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళనను వ్యక్తం చేశారు.
భారత శాశ్వత సభ్యత్వ సమస్యను ప్రస్తావించిన మైఖేల్
గుటెరస్ పోస్ట్‌పై అమెరికాలో జన్మించిన ఇజ్రాయెల్ వెంచర్ క్యాపిటలిస్ట్ మైఖేల్ ఐసెన్‌బర్గ్ స్పందించారు. భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వ సమస్యను మైఖేల్ లేవనెత్తారు. శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని మైఖేల్ ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితిని రద్దు చేసి.. బలమైన నాయకత్వంతో కొత్త సంస్థను రూపొందించాలని సూచించారు. ఐసెన్‌బర్గ్ ట్వీట్‌పై ఎలాన్ మస్క్ స్పందించారు. 'భూమిపై అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం లభించకపోవడం అసంబద్ధమైనదన్నారు.