
Turkey: తుర్కియే సంస్థపై భారత్ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ
ఈ వార్తాకథనం ఏంటి
తుర్కియేతో సంబంధాలపై వివాదం వెల్లువెత్తడంతో, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెలెబీ కంపెనీపై తీవ్ర ప్రభావం చూపింది.
మే 16న ఇస్తాంబుల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సెలెబీ షేర్ ధర ఏకంగా 10 శాతం పడిపోయింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ మొత్తం 30 శాతానికి పతనమైంది.
భారత్‌లో సెలెబీ సబ్సిడరీ సంస్థ గుండా విమానాశ్రయాల్లో సరకుల రవాణా సహా పలు సేవలను ఇప్పటివరకు అందిస్తోంది.
అయితే, ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో తుర్కియే ప్రభుత్వం పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడడమే కాకుండా, తమ సైనికులను అక్కడకు పంపడం భారత ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేసింది.
Details
ఒప్పందాన్ని రద్దు చేసుకున్న అదానీ గ్రూప్
దాంతో సెలెబీకి ఉన్న అన్ని సెక్యూరిటీ క్లియరెన్స్‌లు రద్దు చేయడంతోపాటు, దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల నుంచి సంస్థ కార్యకలాపాలను తొలగించేందుకు చర్యలు మొదలయ్యాయి.
అదానీ గ్రూప్‌కు చెందిన ఎయిర్‌పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ కూడా సెలెబీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో ముంబయి, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ముగిశాయి.
ఈ రెండు విమానాశ్రయాల ప్రతినిధులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
అదానీ గ్రూప్ ప్రస్తుతం ముంబయి, అహ్మదాబాద్, మంగళూరు, గువహాటి, జైపూర్, లఖ్‌నవూ, తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్స్‌ను నిర్వహిస్తోంది.
Details
ఎర్డోగాన్ కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదు
అంతేకాకుండా దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) కూడా సెలెబీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసింది.
భవిష్యత్తులో AISATS, బర్డ్ గ్రూప్ సంస్థలతో కలిసి పని చేయనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో, తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ సెలెబీ సంస్థ ఓ వివరణ విడుదల చేసింది.
తాము తుర్కియే కంపెనీ కాదని, ఎర్డోగాన్ కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన కుమార్తె సుమెయ్యి ఎర్డోగాన్ తమ కంపెనీని నియంత్రిస్తుందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. మా మాతృసంస్థలో ఆమెకు గానీ, ఆమె పేరుతో ఉన్న ఎవరికీ గానీ హక్కులు లేదా వాటాలు లేవని తెలిపింది.