Iran: ఇరాన్‌లో భారతీయుల అరెస్టుల వార్తలు అబద్ధం: స్పష్టం చేసిన టెహ్రాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అక్కడ ఆరుగురు భారతీయులను అరెస్టు చేశారన్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. ఈ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవని స్పష్టం చేసింది. ఇరాన్‌లో పెరిగిపోతున్న జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హొసేని ఖామెనీ నేతృత్వంలోని ఇస్లామిక్ పాలనపై ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై భారత్‌లోని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలి ఎక్స్ (X) వేదికగా స్పందించారు. "ఇరాన్ పరిణామాలపై కొన్ని విదేశీ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అబద్ధం. ప్రజలు నమ్మదగిన వనరుల నుంచే సమాచారం తెలుసుకోవాలి" అని ఆయన తెలిపారు.
వివరాలు
500 మందికిపైగా మృతి
ఇదిలా ఉండగా, ఇరాన్‌లో జరుగుతున్న అశాంతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి మరింత తీవ్రమైతే సైనిక చర్యలతో సహా పలు మార్గాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. టెహ్రాన్ చేపట్టిన అణిచివేత చర్యల్లో ఇప్పటివరకు 500 మందికిపైగా మృతి చెందారని కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, నిరసనకారుల రక్షణ పేరుతో అమెరికా జోక్యం చేసుకుంటే, అమెరికా సైన్యం, ఇజ్రాయెల్ "చట్టబద్ధ లక్ష్యాలే" అంటూ ఇరాన్ హెచ్చరించింది.
వివరాలు
ఇరాన్‌లో నిరసనలు - మృతులు,అరెస్టులు
ఇరాన్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలపై భద్రతా బలగాలు తీవ్రంగా వ్యవహరిస్తుండటంతో ఇప్పటివరకు కనీసం 544 మంది మృతి చెందారని, ఇంకా మరింత మంది చనిపోయి ఉండవచ్చని కార్యకర్తలు చెబుతున్నారు. గత రెండు వారాల్లో 10,600 మందికి పైగా అరెస్టు అయ్యారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మృతుల్లో 496 మంది నిరసనకారులు కాగా, 48 మంది భద్రతా బలగాలకు చెందినవారని పేర్కొంది. అయితే, మొత్తం మృతుల సంఖ్యపై ఇరాన్ ప్రభుత్వం అధికారిక వివరాలు ఇవ్వలేదు. పదవీచ్యుతుడైన ఇరాన్ షా కుమారుడు రెజా పహ్లవీ భద్రతా బలగాలు ప్రజల పక్షాన నిలవాలని పిలుపునిస్తూ, నిరసనలు మరింత ఊపందుకుంటున్నాయని తెలిపారు.
వివరాలు
పునాక్ ప్రాంతంలో నిరసనకారులు రోడ్డెక్కిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో..
ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, ఫోన్ లైన్లు కట్ చేయడంతో బయట ప్రపంచానికి సమాచారం చేరడం కష్టమవుతోంది. ఈ సమాచార నిషేధం వల్ల భద్రతా బలగాలు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశముందన్న భయం విదేశాల్లో ఉన్న ఇరానీయుల్లో వ్యక్తమవుతోంది. ఉత్తర టెహ్రాన్‌లోని పునాక్ ప్రాంతంలో నిరసనకారులు రోడ్డెక్కిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ల లైట్లు ఆన్ చేసి, లోహాలను కొట్టుతూ, బాణసంచా కాలుస్తూ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అలాగే టెహ్రాన్‌కు ఈశాన్యంగా ఉన్న మష్హద్, ఆగ్నేయంగా ఉన్న కెర్మాన్ నగరాల్లో కూడా నిరసనలు జరిగినట్లు సమాచారం.
వివరాలు
పరిస్థితి ప్రశాంతంగానే ఉందన్న ఇరాన్ ప్రభుత్వ టీవీ
ఇరాన్ ప్రభుత్వ టీవీ మాత్రం కొన్ని నగరాల్లో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని చూపించింది. అయితే, టెహ్రాన్, మష్హద్ వంటి ప్రధాన నగరాల దృశ్యాలను ప్రసారం చేయలేదు. ఈ క్రమంలో భద్రతా అధికారి అలీ లారిజానీ నిరసనకారులను ఐసిస్ ఉగ్రవాదులతో పోల్చుతూ, కొందరు ప్రజలను చంపారని, కాల్చారని ఆరోపించారు. మరోవైపు, సంస్కరణవాదిగా పేరున్న అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా కఠిన స్వరంతో స్పందించారు. "ప్రజలకు సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. కానీ అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయడానికి అనుమతించలేం" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
అమెరికా హెచ్చరికలు - ఇరాన్ ప్రతిస్పందన
ఇరాన్‌పై చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చర్చలకు సిద్ధమని ఇరాన్ ప్రతిపాదించిందని ఆయన తెలిపారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ నేరుగా దాడులు చేయడం, సైబర్ దాడులు వంటి అంశాలపై అమెరికా జాతీయ భద్రతా బృందం ఆలోచనలో ఉందని ఏపీ కథనం పేర్కొంది. దీనిపై స్పందించిన ట్రంప్, "ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే, ఇప్పటివరకు చూడని స్థాయిలో ఎదురుదాడి చేస్తాం" అని స్పష్టం చేశారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఖలిబాఫ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడి జరిగితే, ఇజ్రాయెల్‌తో పాటు ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలన్నీ లక్ష్యాలేనని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల సందర్భంగా పార్లమెంట్‌లో "డెత్ టు అమెరికా" నినాదాలు మార్మోగాయి.
వివరాలు
ఇరాన్ ఇస్లామిక్ పాలనకే సవాల్ విసిరే స్థాయికి ఆందోళనలు
ఇజ్రాయెల్‌తో ఇటీవల జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్ గగన రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్న నేపథ్యంలో, నిజంగా యుద్ధానికి ఇరాన్ సిద్ధమా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. తుది నిర్ణయం మాత్రం 86 ఏళ్ల సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామెనీ చేతుల్లోనే ఉంది. గతేడాది డిసెంబర్ 28న ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ భారీగా పడిపోవడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి. ఒక డాలర్‌కు 14 లక్షల రియాల్స్ వరకు మారకం రేటు పడిపోవడం, అంతర్జాతీయ ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుదేలవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. మొదట ఆర్థిక సమస్యలతో మొదలైన ఈ ఆందోళనలు, క్రమంగా ఇరాన్ ఇస్లామిక్ పాలనకే సవాల్ విసిరే స్థాయికి చేరుకున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇరాన్ అంబాసడర్ చేసిన ట్వీట్
The news circulated on some foreign X accounts about Iran’s developments, is totally false. I request all interested people to get their news from the reliable sources. pic.twitter.com/mZpxZVYBXR
— Iran Ambassador Mohammad Fathali (@IranAmbIndia) January 11, 2026