Big Ticket: అబూధాబి బిగ్ టికెట్‌లో భారత గృహిణికి రూ.65 కోట్ల జాక్‌పాట్
ఈ వార్తాకథనం ఏంటి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబూధాబీలో ప్రతి నెల నిర్వహించే ప్రముఖ 'బిగ్ టికెట్' లక్కీ డ్రాలో భారత మహిళ భారీ జాక్‌పాట్‌ను సొంతం చేసుకున్నారు. దిల్లీకి చెందిన 42 ఏళ్ల గృహిణి కనికా అరోడా ఈ డ్రాలో విజేతగా నిలిచి, ఏకంగా రూ.65 కోట్ల బహుమతిని గెలుచుకున్నారు. తాను విజేతగా ఎంపికైనట్లు సమాచారం అందిన క్షణంలో ఆ వార్తను తొలుత నమ్మలేకపోయానని కనికా తెలిపారు. అంత పెద్ద మొత్తంలో బహుమతి రావడం జీవితంలో ఊహించని సంఘటనగా భావించినట్లు ఆమె పేర్కొన్నారు.
వివరాలు
జాక్‌పాట్ బహుమతితో సొంత ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయం
గత మూడు సంవత్సరాలుగా తన భర్తతో కలిసి బిగ్ టికెట్ లక్కీ డ్రాల్లో పాల్గొంటున్నామని కనికా వెల్లడించారు. అయితే ఈసారి మాత్రం తన పేరుతో టికెట్‌ను కొనుగోలు చేశామని చెప్పారు. బిగ్ టికెట్ గురించి మొదట సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నామని, అప్పటి నుంచి క్రమం తప్పకుండా డ్రాల్లో పాల్గొంటూ వస్తున్నామని వివరించారు. జాక్‌పాట్‌గా లభించిన మొత్తంలో కొంత భాగంతో తమ కుటుంబానికి ఒక సొంత ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు కనికా తెలిపారు. మిగిలిన మొత్తాన్ని భవిష్యత్ అవసరాలు, కుటుంబ సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు వెల్లడించారు.