Smith Machar: భారత పైలట్ సాహసానికి ఇజ్రాయెల్ ఫిదా.. అత్యున్నత పౌర పురస్కారం ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
విమానంలో సహ పైలట్ దాడి చేసినా భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. తీవ్రంగా గాయపడినప్పటికీ పోరాడి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఆయన సాహసాన్ని గుర్తించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర సాహస పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ వెల్లడించారు. మచ్చర్ గాయాల నుంచి కోలుకున్న తర్వాత తానే స్వయంగా పురస్కారాన్ని అందజేస్తానని తెలిపారు.
వివరాలు
కాక్‌పిట్‌లో గొడ్డలితో దాడి
గతవారం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
యూఏఈ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. విమాన సహ పైలట్ హమామ్ అల్ హమ్మామీ కాక్‌పిట్‌లో ఉన్న గొడ్డలితో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేశాడు.
అనంతరం విమాన నియంత్రణను తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనను ఉగ్రదాడిగా యూఏఈ అధికారులు అభివర్ణించారు.
గాయాలతోనే ప్రతిఘటన.. ప్రయాణికుల సాహసం
సహ పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చర్ వెనక్కి తగ్గలేదు. అతడిని ప్రతిఘటించి, గాయాలతోనే కాక్‌పిట్ తలుపు తెరిచారు.
దీంతో లోపలికి ప్రవేశించిన ప్రయాణికులు దాడికి పాల్పడిన సహ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పైలట్ ధైర్యం, ప్రయాణికుల చొరవతో విమానం ప్రమాదానికి గురికాకుండా నిలువరించగలిగారు.
వివరాలు
ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులకూ పురస్కారాలు
ఈ ఘటనలో 174 మంది ప్రాణాలను కాపాడటంలో మచ్చర్ కీలక పాత్ర పోషించారు.
ఈ ఘటనలో ధైర్యంగా వ్యవహరించిన ఆరుగురు ఇజ్రాయెల్ పౌరులను కూడా అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ పౌర సాహస పురస్కారాలతో సత్కరించారు.
తాలి మేనెస్, జ్వికా మేనెస్, యానివ్ హయూన్, డాక్టర్ షోటా ముసాయేవ్, అసఫ్ రాజువాన్, ఓర్ పార్డిలోవ్‌లకు జెరూసలేంలోని అధ్యక్ష భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారాలు అందజేశారు.
ప్రమాదకర పరిస్థితుల్లో వారు చూపిన ధైర్యసాహసాలను ఈ సందర్భంగా గుర్తించారు.
వివరాలు
ప్రధాని నెతన్యాహుతో ఘటన వివరాలు
విమానంలో ఎదురైన భయానక అనుభవాన్ని కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా మచ్చర్ సాహసాన్ని గుర్తించిన నెతన్యాహు, ఇజ్రాయెల్ తదుపరి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.
ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వేడుక జ్యోతిని వెలిగించాలని కోరారు. విమానంలో ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిన గౌరవం ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచింది.