
Indian student visas: ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ.. అమెరికాకు భారతీయ విద్యార్థి వీసాలు 44% పైగా తగ్గాయి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి,మాస్ డిపోర్టేషన్,అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై కఠిన ఆంక్షలతో వలసదారులపై విరుచుకుపడుతున్నారు . ఈ విధానాల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా పనిచేసే వలసదారులపై నియంత్రణ పెంచడం జరుగుతుంది. ఫలితంగా,"బంగారు భవిష్యత్తు" కోసం అమెరికాకు వెళ్ళాలనుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం,ఆగస్టులో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. ట్రంప్ పాలనలో అమలు చేసిన కఠిన వీసా విధానాలు కారణంగా విదేశీ విద్యార్థుల కోసం జారీచేసే వీసాల సంఖ్య భారీగా తగ్గింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య 19శాతం తగ్గింది.
వివరాలు
చైనా విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్య 86,647
కరోనా మహమ్మారి తర్వాత ఇదే రికార్డు స్థాయి తగ్గుదల కావడం గమనార్హం. భారతీయ విద్యార్థుల విషయానికి వస్తే, ఆగస్టులో వీసాల సంఖ్యలో 44% వరకు క్షీణత ఏర్పడింది. సాధారణంగా యూఎస్ విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యే ఆగస్టులో అమెరికా 3,13,138 విద్యార్థి వీసాలు జారీ చేసింది. గత ఏడాదిలో భారత్ నుండి వచ్చిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా అధికంగా ఉండేది. ఈసారి అది గణనీయంగా తగ్గింది. మరోవైపు,చైనా విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్య 86,647 ఉండగా, భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం. ఈ ఏడాది మే నెలలో,ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్త విద్యార్థి వీసా దరఖాస్తుల ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
వివరాలు
సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు
ఈ నిర్ణయం "సోషల్ మీడియా వెట్టింగ్" ప్రక్రియకు సంబంధించినదని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. వీసా దరఖాస్తుదారుల ఆన్‌లైన్ యాక్టివిటీని పరిశీలించడం ద్వారా, వారి వీసా ఆమోదాన్ని నిర్ణయించేందుకు ఈ ప్రాసెస్ అమలులో ఉంది. సంబంధిత అభ్యర్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లు సమగ్రంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వీసాలు మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా, ట్రంప్ పాలనలో హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును గణనీయంగా పెంచిన నిర్ణయం కూడా అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థులపై నేరుగా ప్రభావం చూపింది. ఈ విధానాలు కలిపి, అమెరికా వలస విధానంలో తీవ్రమైన మార్పులను తీసుకువచ్చాయి, దీని ప్రభావం స్పష్టంగా భారతీయ విద్యార్థుల వీసా అభ్యర్థనలపై పడుతున్నది.