Gibran Rakabuming Raka: ఇండోనేషియా ఉపాధ్యక్షుడి రాజీనామా.. తెరపైకి విద్యార్హతల వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ఉపాధ్యక్షుడు గిబ్రాన్ రకబుమింగ్ రాకా తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. నవంబర్ 11న అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు రాజీనామా లేఖ అందించినట్లు ఆయన సహాయకుడు బుడి ఆరీ వెల్లడించారు. అయితే ఈ రాజీనామాను అధ్యక్షుడు అధికారికంగా ఆమోదించారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గిబ్రాన్ విద్యార్హతలకు సంబంధించిన వివాదమే ఈ పరిణామానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇండోనేషియా చట్టాల ప్రకారం ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వ్యక్తి సీనియర్ సెకండరీ విద్యను పూర్తి చేసి ఉండాలి. అయితే తాను సింగపూర్, ఆస్ట్రేలియాలో చదువుకుని అందుకు సమానమైన విద్యార్హతలు పొందినట్లు గిబ్రాన్ గతంలో వెల్లడించారు.
వివరాలు
అభిశంసనకు సన్నాహాలు..
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆయన విదేశీ విద్యార్హతలు ఇండోనేషియా హైస్కూల్ విద్యకు సమానమని నిరూపించే ఆధారాలు లేవని పేర్కొంది.
అంతకుముందు రాజ్యాంగ న్యాయస్థానం కూడా ఇదే అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
న్యాయస్థానాల తీర్పులతో గిబ్రాన్‌పై రాజకీయ ఒత్తిడి మరింత పెరిగింది.
నవంబర్ 11న పార్లమెంట్‌లోని ఎనిమిది వర్గాలకు చెందిన 120 మంది సభ్యులు ఆయనపై అభిశంసన ప్రక్రియకు దారితీసే అభిప్రాయ తీర్మానంపై సంతకాలు చేశారు.
దీంతో ఆయన రాజ్యాంగబద్ధంగా ఉపాధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అర్హుడా? కాదా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
వివరాలు
ప్రభుత్వానికి వరుస సవాళ్లు..
మాజీ అధ్యక్షుడు జోకో విడోడో కుమారుడైన గిబ్రాన్.. 2024 ఎన్నికల్లో ప్రబోవో సుబియాంటోతో కలిసి పోటీ చేసి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రబోవో, జోకో వర్గాల మధ్య సంబంధాలు క్రమంగా బలహీనపడ్డాయి.
కొత్త రాజధాని నుసంతారా ప్రాజెక్టు, ప్రభుత్వంలోని కీలక పదవుల్లో మార్పులు ఈ రెండు వర్గాల మధ్య విభేదాలకు కారణాలుగా చర్చకు వచ్చాయి.
మరోవైపు ప్రబోవో ప్రభుత్వానికి కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
పాఠశాలల్లో ఉచిత భోజన పథకానికి నిధుల కొరత,కార్చిచ్చులు,స్టాక్ మార్కెట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి.
అవినీతి,పర్యావరణ సమస్యలకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు కూడా చేపట్టారు.
ఈ పరిణామాల మధ్య ఉపాధ్యక్షుడి రాజీనామా వ్యవహారం ఇండోనేషియా రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
కొత్త ఉపాధ్యక్షుడి ఎంపిక ఎలా?
గిబ్రాన్ రాజీనామాను అధ్యక్షుడు అధికారికంగా ఆమోదించిన తర్వాత ఇండోనేషియా పార్లమెంట్ ఉపాధ్యక్ష పదవి ఖాళీ అయినట్లు ప్రకటించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అధ్యక్షుడు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తారు.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం 60 రోజుల్లోగా అసెంబ్లీ సమావేశమై ఎన్నిక నిర్వహించాలి. ఈ ప్రక్రియ ద్వారా కొత్త ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తారు.