Page Loader
INTERPOL: మొదటిసారి ఇంటర్‌పోల్ 'సిల్వర్ నోటీసులు' జారీ.. ఏమిటివి!  
మొదటిసారి ఇంటర్‌పోల్ 'సిల్వర్ నోటీసులు' జారీ.. ఏమిటివి!

INTERPOL: మొదటిసారి ఇంటర్‌పోల్ 'సిల్వర్ నోటీసులు' జారీ.. ఏమిటివి!  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ దేశాలకు నేర సంబంధిత అంశాల్లో ఒక ముఖ్యమైన వారధిగా పనిచేస్తున్న అంతర్జాతీయ పోలీస్‌ సహకార సంస్థ (INTERPOL) తాజాగా ఒక కొత్త ముందడుగు వేసింది. ఈ సంస్థ తొలిసారిగా సిల్వర్‌ నోటీసులు (Silver Notice) జారీచేసింది. ఈ నోటీసులు విదేశాల్లో అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలను వెలికి తీసేందుకు మద్దతు అందించేందుకు పరిచయం చేయబడ్డాయి. ఇటలీ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఓ మాఫియా సభ్యుడి ఆస్తులకు సంబంధించిన సిల్వర్‌ నోటీసులు తొలిసారిగా జారీ చేసినట్లు ఇంటర్‌పోల్‌ ప్రకటించింది.

వివరాలు 

ఇంటర్‌పోల్‌'లో ప్రస్తుతం 196 సభ్య దేశాలు 

ఫ్రాన్స్‌లోని లియోన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్‌పోల్‌ ప్రస్తుతం 196 సభ్య దేశాలను కలిగి ఉంది. ఈ సంస్థ విదేశాలకు పారిపోయిన నేరస్థులు,ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని కోరుతూ వివిధ దేశాల నుంచి వచ్చే విజ్ఞప్తులపై నోటీసులను జారీ చేస్తుంది. ఈ నోటీసులకు ఉపయోగించే కలర్‌ కోడ్స్‌లో రెడ్‌, ఎల్లో, బ్లూ, బ్లాక్‌, గ్రీన్‌, ఆరెంజ్‌, పర్పుల్‌ వంటి రంగులు ఉన్నాయి. తాజా జోడింపుగా సిల్వర్‌ నోటీసులు కూడా ప్రవేశపెట్టబడింది. రెడ్‌ నోటీసులు విదేశాలకు పారిపోయిన నేరస్థులను నిర్బంధించడానికి ఉపయోగపడతాయి.

వివరాలు 

ఇంటర్‌పోల్‌లో భారత్‌  ఒక సభ్య దేశం

ఇంటర్‌పోల్‌లో భారత్‌ కూడా ఒక సభ్య దేశంగా ఉంది. మన దేశం నుంచి దాదాపు 10 మంది ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పారిపోయిన వారుగా జాబితాలో ఉన్నారు. అయితే, విదేశాలకు తరలించిన నల్లధనం మొత్తం ఎంత అనేది స్పష్టమైన అంచనాలు లేవు. ఈ నేపథ్యంలో, నేరస్థులు అక్రమంగా సరిహద్దులు దాటించిన ఆస్తులను గుర్తించడంలో సిల్వర్‌ నోటీసులు భారత్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని ఈ విషయంపై అవగాహన ఉన్న ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు.

వివరాలు 

CBI 'భారత్‌పోల్‌' పోర్టల్‌

సిల్వర్‌ నోటీసు కోడ్‌ను ఉపయోగించి నేరస్థుల అక్రమ ఆస్తుల వివరాలను గుర్తించేందుకు ఇంటర్‌పోల్‌ ఇటీవల పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో మోసం, అవినీతి, డ్రగ్‌ అక్రమ రవాణా, ఇతర తీవ్రమైన నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తుల కీలక సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని, ఆయా దేశాలకు అందజేస్తుంది. ఈ ప్రాజెక్టులో భారత్‌ కూడా భాగంగా ఉంది. అంతర్జాతీయ సహకారాన్ని సులభతరం చేయడం కోసం, కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) 'భారత్‌పోల్‌' అనే పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.