Interpol: సుదీక్ష కోణంకి కోసం అన్వేషణ..ఆచూకీపై ఇంటర్‌పోల్ ఎల్లో నోటీస్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
డొమినికన్ రిపబ్లిక్‌లో (Dominican Republic) అదృశ్యమైన భారతీయ మూలాలున్న విద్యార్థిని సుదీక్ష కోణంకి (Sudiksha Konanki) కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
మార్చి 6న స్థానిక రియూ రిపబ్లికా రిసార్ట్ బీచ్ వద్ద చివరిసారిగా కనిపించిన ఆమె ఆచూకీ ఇంకా లభించకపోవడంతో కుటుంబ సభ్యులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్పోల్) ఆమె కోసం ఎల్లో నోటీస్ జారీ చేసింది.
ఇందులో సుదీక్ష అదృశ్యమైన సమయంలో ధరించిన దుస్తులు, గుర్తింపు కోసం అవసరమైన ఇతర వివరాలను పొందుపరిచారు.
వివరాలు
కేసులో తాజా పరిణామాలు
దర్యాప్తు ప్రక్రియలో భాగంగా, బీచ్ వద్ద లాంజ్ కుర్చీపై ఆమె దుస్తులు ఉన్నట్లు కొన్ని దృశ్యాలు బయటకు వచ్చాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
కొన్ని దుస్తులు మట్టిలో కూరుకుపోయినట్టు గుర్తించారు. ఆమె సముద్రంలోకి వెళ్లే ముందు వాటిని అక్కడ వదిలి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.
అదనంగా, ఆమె చివరిసారిగా ధరించిన దుస్తులు ఈ దృశ్యాల్లో కనబడిన వాటికి అనుగుణంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
వివరాలు
"ఆమె నా ముందే ఉంది.."
సుదీక్ష అదృశ్యమైన రోజు ఆమె ఐయోవాకు చెందిన 24 ఏళ్ల పర్యాటకుడు జాషువా స్టీవెన్ రిబెతో కలిసి బీచ్‌కు వెళ్లినట్లు గుర్తించారు.
అతడిని అధికారులు ప్రశ్నించగా, సుదీక్ష తనతోనే ఉందని ఒప్పుకున్నట్లు సమాచారం.
బీచ్‌లో ఉన్న సమయంలో ఓ భారీ అల వారిని బలంగా తాకిందని, దాంతో సుదీక్ష నీళ్లలో పడిపోతుండగా తాను ఆమెను పట్టుకుని కొద్దిదూరం ముందుకు తీసుకొచ్చానని అతడు తెలిపాడు.
అయితే, అప్పటికే ఆమె చాలా నీళ్లు మింగి వాంతులు చేసి స్పృహ తప్పిపోయిందని వివరించాడు.
అనంతరం ఆమె కనిపించకపోవడంతో వెతికానని, కానీ కనిపించకపోవడంతో వెళ్లిపోయి ఉంటుందని అనుకున్నానని పేర్కొన్నాడు.
వివరాలు
తల్లిదండ్రుల ఆందోళన
సుదీక్ష తల్లిదండ్రులు తమ కుమార్తెను ఎవరైనా అపహరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
సాధారణంగా ఆమె తన ఫోన్‌ను ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేదని, ఇతరులకు ఇవ్వదని తెలిపారు.
అయితే, ఆమె అదృశ్యమైన సమయంలో ఆమె ఫోన్, ఇతర వ్యక్తిగత వస్తువులు స్నేహితుల వద్ద ఉండటంపై వారు తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు.
అపహరణ కోణాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను కోరారు.