Iran: చిన్నారుల ఆసుపత్రిపైనా దాడా? అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగుతున్న నేపథ్యంలో, అమెరికా తాజా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులకు వైద్యసేవలు అందిస్తున్న ఆసుపత్రిని కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిందని ఆరోపిస్తూ, దీనిని అత్యంత అమానవీయమైన చర్యగా ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి విమర్శించారు. అమెరికా దాడుల కారణంగా ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఇరాన్ తెలిపింది. ముఖ్యంగా చిన్నారుల క్యాన్సర్ చికిత్స విభాగం ఈ దాడుల ప్రభావానికి గురైందని పేర్కొంది. కీమోథెరపీ పొందుతున్న చిన్నారుల భద్రత దృష్ట్యా ఆసుపత్రిని అత్యవసరంగా ఖాళీ చేయించి, రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించింది.
వివరాలు
211 మంది రోగులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఈ ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి స్పందిస్తూ,"ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై ఇజ్రాయెల్ గతంలో జరిపిన దాడులను ఈ ఘటన గుర్తుకు తెస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు తీవ్ర భయానికి గురయ్యారు. వెంటనే కీమోథెరపీ పొందుతున్న 211 మంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ప్రాణాల కోసం పోరాడుతున్న అమాయక చిన్నారులపై జరిగిన ఈ చర్య ఒక పిరికిపంద యుద్ధ నేరం" అని ఎక్స్ వేదికగా ఆరోపించారు.
అంతేకాదు,"మానవ హక్కుల గురించి నిరంతరం నీతులు చెప్పే దేశాలు ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న దాడుల విషయంలో మౌనం పాటిస్తున్నాయి.ఇలాంటి వైఖరితో అవి తమ నైతిక విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయాయి" అంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
వివరాలు
ఇరాన్‌లో పలుచోట్ల పేలుళ్లు.. పెరుగుతున్న ప్రాణనష్టం
అల్ జజీరా కథనం ప్రకారం, ఇరాన్‌లోని కెష్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్, సిరిక్, చబహార్, కొనారక్, రాస్క్ సిటీతో పాటు మరికొన్ని ప్రాంతాలపై అమెరికా దాడులు జరిగినట్లు సమాచారం.
అదే సమయంలో ఇరాన్ సైనిక స్థావరాలపై కూడా అమెరికా ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు పేర్కొంది.
ఈ దాడుల్లో కనీసం ఏడుగురు సైనికులు మరణించినట్లు, దేశవ్యాప్తంగా వందలాది మంది గాయపడినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు అమెరికా దాడుల కారణంగా ఇరాన్‌లో కనీసం 35 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా గాయపడినట్లు టెహ్రాన్ ప్రకటించింది.