Iran: సీమైన్స్ భయం.. హర్మూజ్‌లో కొత్త మార్గాలపై ఇరాన్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) అంశంలో ఇరాన్ మరో కీలక ప్రకటన చేసింది. ఆ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, మిత్రదేశాల నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ సీమైన్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో నౌకల భద్రత దృష్ట్యా కొత్త మార్గాలను సూచించింది. సముద్ర భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సీమైన్స్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలంటూ ఐఆర్‌జీసీ సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయం నౌకాయాన రంగంలో చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
ఇక మరోవైపు, ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీంతో పరిస్థితులు కొంతమేరకు శాంతించాయని భావించారు. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు పరిస్థితిని మళ్లీ ఉద్రిక్తంగా మార్చుతున్నాయి. వాషింగ్టన్‌తో ఒప్పందం ప్రకారం హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచిన టెహ్రాన్.. లెబనాన్ దాడులకు ప్రతిగా మళ్లీ దానిని మూసివేసింది. అంతేకాక కాల్పుల విరమణ ఒప్పందం నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. ఇటీవలే హర్మూజ్ మూసివేతపై ప్రకటన చేసిన ఇరాన్.. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిందన్న వార్తలు రావడం గందరగోళానికి దారితీస్తోంది. ఈ కీలక జలసంధి పరిస్థితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.