Iran-USA: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. పలు యుద్ధ విమానాలు ధ్వంసం!
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించేందుకు అమెరికా చేపడుతున్న దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నామని ఇరాన్ ప్రకటించింది. తమ భూభాగంలోని పలు ప్రాంతాలపై అమెరికా కొనసాగిస్తున్న వైమానిక దాడులకు ప్రతీకారంగా జోర్డాన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాన్ని క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలతో పాటు రీఫ్యూయెలింగ్ విమానాలు ధ్వంసమైనట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. అదనంగా మరికొన్ని ఫైటర్ జెట్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. అయితే, ఈ ప్రకటనపై అమెరికా నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. ఇదిలా ఉండగా, ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను గగనతలంలోనే కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హంగా మారింది.
వివరాలు
సిరియాలో దాడులు
ఇరాన్‌షహర్‌లో తమ సైనికులు హతమైన ఘటనకు ప్రతీకారంగా సిరియాలోని అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ కేంద్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది.
అయితే, ఈ స్థావరం నుంచి తమ దళాలను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు అమెరికా సైన్యం గత ఫిబ్రవరిలోనే ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఇరాన్ పేర్కొన్న దాడి నిజంగానే ఆ స్థావరంపై జరిగిందా లేదా అన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో సందిగ్ధత నెలకొంది.
వివరాలు
దాడులు ఉద్ధృతం చేసిన అమెరికా
మరోవైపు, అమెరికా దళాలు కూడా ఇరాన్‌లోని పలు కీలక ప్రాంతాలపై వైమానిక దాడులను మరింత ఉద్ధృతం చేశాయి.
అహ్‌వాజ్, క్వెషం, బుషెహర్, దస్తీ, బోట్సన్, సిరిక్, బందర్ అబ్బాస్ తదితర ప్రాంతాల్లోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని బాంబుదాడులు నిర్వహిస్తున్నాయి.
బందర్-ఇ-ఖమీర్ ప్రాంతంలోని మూడు వంతెనలు ఈ దాడుల్లో దెబ్బతిన్నాయి. హర్మూజ్ ప్రావిన్స్‌లోని రోడ్డు, రైల్వే నెట్‌వర్క్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకుంది.
ఇరాన్‌షహర్ విమానాశ్రయంపై కూడా దాడులు జరగడంతో నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
కిష్ ద్వీపంలో జరిగిన దాడుల కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
అలాగే చాబహార్‌లోని మారిటైమ్ కంట్రోల్ టవర్‌పై అమెరికా మూడోసారి దాడి చేసినట్లు సమాచారం.