Loading...
Iran: యుద్ధ భయంతో ఇరాన్‌ కీలక నిర్ణయం.. మహిళలకు మిలిటరీ శిక్షణ!
యుద్ధ భయంతో ఇరాన్‌ కీలక నిర్ణయం.. మహిళలకు మిలిటరీ శిక్షణ!

Iran: యుద్ధ భయంతో ఇరాన్‌ కీలక నిర్ణయం.. మహిళలకు మిలిటరీ శిక్షణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ప్రస్తుతం బాంబుల వర్షం కురవడం లేదు. అయినప్పటికీ యుద్ధ వాతావరణం మాత్రం కొనసాగుతోంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన నేపథ్యంలో.. టెహ్రాన్‌ నుంచి కొన్ని కీలక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌ మహిళల చేతుల్లో తుపాకులు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు భూతల దాడులకు దిగే అవకాశం ఉందనే భయాల నేపథ్యంలో ఇరాన్‌ సైన్యం మహిళలకు మిలిటరీ శిక్షణ ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఆయుధాల వినియోగంపై మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

వివరాలు

ఇరాన్‌ మహిళలకు సైనిక శిక్షణ

టెహ్రాన్‌లోని ఇమామ్‌ హుస్సేన్‌ స్క్వేర్‌లో ఉన్న సైనిక కేంద్రంలో ఇరాన్‌ మహిళలకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ శిక్షణలో హ్యాండ్‌గన్‌ సహా ఇతర ఆయుధాలను ఎలా ఉపయోగించాలో మహిళలకు నేర్పిస్తున్నారు.

యుద్ధ పరిస్థితులు తలెత్తిన సమయంలో తమ కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల వారిని ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం ద్వారా తమ భయాలు కొంత తగ్గుతున్నాయని శిక్షణ పొందుతున్న మహిళలు చెబుతున్నారు.

వివరాలు

ట్రంప్‌ హెచ్చరికలకు ఇరాన్‌ గట్టి బదులు

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న హెచ్చరికలకు ఇరాన్‌ కూడా గట్టిగానే స్పందిస్తోంది.

ఆంక్షలు విధించడం, సైనిక బలప్రయోగం చేయడం ద్వారా ఘర్షణలకు ముగింపు లభించదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పష్టం చేశారు.

న్యాయం, నిష్పక్షపాతంగా జరిగే చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

అణుబాంబు తయారీ దిశగా ఇరాన్‌..?

మరోవైపు అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగే అంశాన్ని ఇరాన్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ అంశం తమ పార్లమెంట్‌ అజెండాలో ఉందని ఇరాన్‌ ఎంపీ అలీరెజా సలిమీ వెల్లడించారు.

అంతేకాకుండా తమ దేశం శుద్ధి చేసిన యురేనియాన్ని వదులుకోబోదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ADVERTISEMENT