Saudi Media: రష్యాకు యురేనియం నిల్వలు అప్పగించేందుకు ఇరాన్ సిద్ధం?.. సౌదీ మీడియా కథనం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ వద్ద భారీ స్థాయిలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్న విషయం తెలిసిందే. ఈ అణు నిల్వలపై ప్రపంచ దేశాలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా,ఇరాన్ అణు కార్యక్రమాలపై కఠిన వైఖరి కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను రష్యాకు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు సౌదీ అరేబియాకు చెందిన 'అల్ హదత్' మీడియా సంస్థ సంచలన కథనం వెల్లడించింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో శాంతి ప్రతిపాదనలు పంపిన ఇరాన్, తమ అణు నిల్వలకు సంబంధించిన వివరాలను అమెరికాకు తెలియజేసినట్లు సమాచారం. అలాగే రష్యాకు యురేనియం బదిలీ చేసే అంశానికి సంబంధించిన రహస్య పత్రాలు తమకు లభించాయని అల్ హదత్ పేర్కొంది.
వివరాలు
శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు కాకుండా రష్యాకు..
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ కథనంలో వెల్లడించారు. అయితే ఇందుకు ఒక ప్రధాన షరతు పెట్టినట్లు తెలుస్తోంది. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు కాకుండా రష్యాకు మాత్రమే అప్పగించాలనే నిర్ణయంపై ఇరాన్ గట్టిగా నిలబడినట్లు సమాచారం. అదే సమయంలో అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని కూడా ఇరాన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నట్లు అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో దాదాపు 60 శాతం వరకు శుద్ధి ప్రక్రియ పూర్తైనట్లు సమాచారం.
వివరాలు
యురేనియం నిల్వలను ఇరాన్ అప్పగించాలి: ట్రంప్
అయితే అణ్వాయుధాల తయారీకి కనీసం 90 శాతం శుద్ధి అవసరమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడించింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా గతంలోనే పలుమార్లు ప్రకటించింది. మరోవైపు ఇరాన్ తమ యురేనియం నిల్వలను అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.