Iran: హర్ముజ్‌లో సర్వీస్ ఫీజు వసూలు.. మిత్ర దేశాలకు ఇరాన్ ప్రాధాన్యం
ఈ వార్తాకథనం ఏంటి
హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సేవా రుసుము (సర్వీస్ ఫీజు) విధించేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ దేశ రాయబారి అబ్దుల్‌రెజా రెహమాన్ ఫాజ్లి వెల్లడించారు. చైనా రాజధాని బీజింగ్‌లో శనివారం నిర్వహించిన ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొన్న ఆయన, యుద్ధ సమయంలో ఇరాన్‌కు అండగా నిలిచిన దేశాలకు ఈ సేవా రుసుములో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించారు. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ఒమన్‌తో కలిసి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మార్గంలో సముద్ర రవాణా సజావుగా సాగేందుకు ట్రాఫిక్ నియంత్రణతో పాటు ఇతర సేవలను అందిస్తున్నందుకు సేవా రుసుము వసూలు చేయనున్నట్లు వివరించారు.
వివరాలు
హర్ముజ్ జలసంధిలో ఎలాంటి టోల్ వసూలు చేయరాదని అమెరికా షరతు
అయితే ఇది టోల్ కాదని అబ్దుల్‌రెజా స్పష్టం చేశారు. హర్ముజ్ జలసంధి ఇరాన్ భూభాగంలో భాగమేనని పేర్కొంటూ, నౌకల సురక్షిత రాకపోకలు, ట్రాఫిక్ నిర్వహణ, ఇతర సేవల కోసం మాత్రమే సర్వీస్ ట్యాక్స్‌ను వసూలు చేస్తామని చెప్పారు. హర్ముజ్ జలసంధిలో ఎలాంటి టోల్ వసూలు చేయరాదని అమెరికా షరతు విధించిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
వివరాలు
తాజా ప్రకటనకు ప్రాధాన్యం
ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తొలి 60 రోజుల పాటు ఎలాంటి టోల్ లేదా రుసుము వసూలు చేయకూడదనే నిబంధన ఉంది. ఆ గడువు ముగిసిన తర్వాత కొత్త పన్నులు లేదా ఇతర రుసుములు అమల్లోకి వస్తాయా అనే అంశంపై ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో హర్ముజ్ జలసంధిలో సేవా రుసుము వసూలు చేస్తామని ఇరాన్ రాయబారి చేసిన తాజా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.