US-Iran Deal: యురేనియం అంశంలో ఇరాన్ కీలక నిర్ణయం.. అమెరికాతో ఒప్పందం దిశగా అడుగులు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు త్వరలో తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య డీల్ దాదాపు పూర్తయినట్టేనని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రధాన ప్రతిష్టంభనగా మారిన ''ఎన్‌రిచ్డ్ యురేనియం'' అంశంపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ వద్ద ఉన్న ఎన్‌రిచ్డ్ యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ సిద్ధమైనట్లు అమెరికన్ మీడియా నివేదించింది.
వివరాలు
భవిష్యత్తులో ఈ అంశం కీలకంగా మారే అవకాశం
ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం, ఇరాన్ తన ఎన్‌రిచ్డ్ యురేనియాన్ని నేరుగా అమెరికాకు అప్పగించడానికైనా, లేక అంతర్జాతీయ పర్యవేక్షణలో బదిలీ చేయడానికైనా అంగీకరించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే, ఆ యురేనియాన్ని నేరుగా అమెరికాకు అందజేస్తారా, లేక రష్యాకు తరలిస్తారా, లేదా తక్కువ ఎన్‌రిచ్డ్ స్థాయికి మార్చుతారా అన్న అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిపై హక్కుల విషయంలో కూడా ఇరాన్ తన డిమాండ్లను ముందుకు తెస్తున్నట్లు సమాచారం. దీంతో భవిష్యత్ చర్చల్లో ఈ అంశం కూడా కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.