Page Loader
Iran: ఇరాన్‌ అల్టిమేటం.. 6.91 లక్షల అఫ్గానీయులు స్వదేశానికి!
ఇరాన్‌ ఉల్టిమేటం.. 6.91 లక్షల అఫ్గానీయులు స్వదేశానికి!

Iran: ఇరాన్‌ అల్టిమేటం.. 6.91 లక్షల అఫ్గానీయులు స్వదేశానికి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ నుంచి అఫ్గానీయుల వెనుదిరుగు కొనసాగుతోంది. అక్రమంగా నివసిస్తున్న వారిపై పాకిస్థాన్‌ ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తుండగా, ఇప్పుడు ఇరాన్‌ సైతం అదే బాటలో నడుస్తోంది. టెహ్రాన్‌ జులై 6ను తుది గడువుగా నిర్దేశించడంతో లక్షలాది మంది అఫ్గానీయులు స్వదేశానికి వెళ్లేందుకు ప్రయాణం ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 6.91 లక్షల మంది అఫ్గానీయులు ఇరాన్‌ను విడిచిపోయినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐవోఎం) వెల్లడించింది. ఇందులో కేవలం జూన్‌ నెలలోనే 2.30 లక్షల మంది తిరిగివెళ్లారు. ఇరాన్‌ విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో జూన్‌ 21 నుంచి 28 మధ్యకాలంలో ఒక్క వారం రోజుల్లోనే 1.31 లక్షల మంది అఫ్గానీయులు బయలుదేరినట్లు ఐవోఎం తెలిపింది.

Details

70శాతానికి పైగా బహిష్కరణకు గురైన వాళ్లే

ఆ వారం చివర్లో ప్రతి రోజూ 30 వేల మందికిపైగా సరిహద్దు దాటినట్టు తెలిపింది. ఈ తరలింపుల్లో 70 శాతానికి పైగా వ్యక్తులు బలవంతంగా బహిష్కరణకు గురైనవారేనని వెల్లడించింది. ఈ పరిస్థితులకు కారణాలు విశ్లేషిస్తూ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పరిస్థితులు, టెహ్రాన్‌ పాలసీల మార్పులు అన్నీ కలిసి ఈ బహిష్కరణ చర్యలకు దారితీశాయని అఫ్గానిస్థాన్‌లో ఐక్యరాజ్యసమితి మిషన్‌ పేర్కొంది. దీంతో ఇప్పటికే ఆర్థికంగా కుంగిపోయిన అఫ్గాన్‌లో మానవతా కార్యక్రమాలు గణనీయంగా ప్రభావితమవుతున్నాయని తెలిపింది.

Details

నిధుల కొరత ప్రభావం

దీనికి తోడు నిధుల కొరత కూడా ప్రభావం చూపుతోందని ఐవోఎం ఆందోళన వ్యక్తం చేసింది. శరణార్థులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితి నెలకొందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో పాకిస్థాన్‌ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు సుమారు 5 లక్షల మంది అఫ్గానీయులను తమ దేశం నుంచి బహిష్కరించింది.