Iran: అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్ 'అరాశ్ ఇ కమాన్‌గీర్''.. ఈ కొత్త గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో సైనిక రంగంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అత్యంత ఖరీదైన అమెరికా ఆయుధాలను తక్కువ వ్యయంతో నిర్వీర్యం చేసే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిన ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది. ఈ చర్య కోసం తాము స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన కొత్త గగనతల రక్షణ వ్యవస్థ 'అరాశ్ ఇ కమాన్‌గీర్'ను వినియోగించినట్లు ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
యుద్ధంలో తొలిసారి..
హర్మూజ్ జలసంధి పరిసరాల్లో సంచరిస్తున్న శత్రు డ్రోన్‌ను లక్ష్యంగా చేసుకుని 'అరాశ్ ఇ కమాన్‌గీర్' వ్యవస్థను ఉపయోగించినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌కు అనుబంధంగా ఉన్న మాధ్యమాలు కథనాలు ప్రచురించాయి. ఈ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నప్పటికీ, దాని సాంకేతిక సామర్థ్యాలకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం లేదా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ నుంచి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. అయితే ఈ సమాచారం నిజమైతే, యుద్ధరంగంలో ఈ వ్యవస్థను వినియోగించడం ఇదే తొలి సందర్భంగా భావిస్తున్నారు.
వివరాలు
తక్కువ వ్యయంతో అధిక ఫలితాలు
అమెరికాతో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ప్రధానంగా తక్కువ ఖర్చుతో తయారయ్యే, వేగంగా మోహరించగల స్వదేశీ రక్షణ వ్యవస్థలపైనే దృష్టి సారిస్తోంది. గతంలో కూడా అత్యాధునిక క్షిపణులను స్వదేశీ డ్రోన్ల సాయంతో అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. దీర్ఘకాలిక ఘర్షణల్లో భారీ ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే తక్కువ వ్యయంతో పనిచేసే ఆయుధ వ్యవస్థలే ఉత్తమమని ఇరాన్ భావిస్తోంది. అదే వ్యూహంలో భాగంగానే 'అరాశ్' వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఆ వీరుడి పేరు మీదుగా..
పర్షియన్ పురాణాల్లో 'అరాశ్' అనే గొప్ప విలుకాడు గురించి ప్రస్తావనలు కనిపిస్తాయి. విదేశీ ప్రభావాల నుంచి తమ భూభాగాన్ని రక్షించేందుకు అతడు పోరాడినట్లు కథనాలు చెబుతున్నాయి. ఒక సందర్భంలో తన శక్తినంతా కూడగట్టి సంధించిన బాణం అనేక రోజుల పాటు ప్రయాణించి దూర ప్రాంతంలోని ఓ చెట్టును తాకిందని, ఆ స్థలాన్ని సరిహద్దుగా నిర్ణయించారని పురాణ గాథలు పేర్కొంటాయి. తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఆ వీరుడి జ్ఞాపకార్థంగా ఇరాన్ ఈ కొత్త గగనతల రక్షణ వ్యవస్థకు 'అరాశ్ ఇ కమాన్‌గీర్' అనే పేరు పెట్టింది.
వివరాలు
ఎలా పనిచేస్తుంది..?
ఇరాన్ అభివృద్ధి చేసిన తక్కువ వ్యయ గగనతల రక్షణ వ్యవస్థల్లో 'అరాశ్' ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. దీని పూర్తి సాంకేతిక వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా కొంతమంది రక్షణ రంగ నిపుణులు దీని పనితీరును విశ్లేషించారు. సాధారణ గగనతల రక్షణ వ్యవస్థల మాదిరిగా ఇది పూర్తిగా రాడార్ కేంద్రాలు లేదా ప్రయోగ వేదికలపై ఆధారపడదని చెబుతున్నారు. రాడార్ సైట్లు ఇచ్చే నిర్దిష్ట మార్గదర్శకాలపై ఆధారపడదు. ఎలక్ట్రో ఆప్టికల్ లేదా హీట్-సీకింగ్ గైడెన్స్ వ్యవస్థల వినియోగించుకుంటుంది ఇందులోని ఇంటర్‌సెప్టర్ కొన్ని గంటల పాటు గాల్లో తిరుగుతూ శత్రు డ్రోన్లు లేదా విమానాలను గుర్తించి,అవకాశం దొరికిన వెంటనే వాటిని ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
వివరాలు
తక్కువ వ్యయంతో అధిక నష్టం
ఈ వ్యవస్థ తయారీ, మోహరింపు, నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాగా తాజాగా కూల్చివేయబడిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ విలువ సుమారు 16 మిలియన్ నుంచి 30 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. దీనిని బట్టి చూస్తే తక్కువ వ్యయంతో అధిక నష్టం కలిగించే వ్యూహాన్ని ఇరాన్ అనుసరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.