Iran: ఇరాన్‌లో పెళ్లి వేడుకపై అమెరికా బాంబు దాడి.. ఐదుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లి వేడుకపై అమెరికా బాంబు దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడిలో చిన్నారి సహా కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున కుహెస్తాక్ నగరంలోని ఓ నివాసంపై ఈ దాడి జరిగింది. దీనిని ఆయన 'క్రూరమైన దాడి'గా అభివర్ణించారు. ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ టీవీ కథనం ప్రకారం.. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. సిరిక్ కౌంటీ గవర్నర్ రెజా షాహిదియాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్‌ఐబీతో మాట్లాడుతూ.. మరో 63 మంది గాయపడినట్లు చెప్పారు. గాయపడిన వారిలో 50 మంది మహిళలు,చిన్నారులు ఉన్నారని తెలిపారు.
వివరాలు
పేలుడు నుంచి బయటపడిన ఓ చిన్నారి
వీరందరినీ సమీపంలోని మినాబ్ నగరంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
పేలుడు నుంచి బయటపడిన ఓ చిన్నారి చెప్పిన వివరాలను ఇరాన్‌కు చెందిన అర్ధ ప్రభుత్వ వార్తా సంస్థ ఫార్స్ ప్రచురించింది.
ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకునే ముందే తమకు యుద్ధ విమానాల శబ్దాలు వినిపించాయని ఆ చిన్నారి తెలిపాడు.
అక్కడికి చేరుకున్న వెంటనే భారీ పేలుడు సంభవించిందని చెప్పాడు.
పేలుడు తీవ్రతకు ఇటుకలు, రాళ్లు, సిమెంట్ ముక్కలు తన ముఖం, తలకు తగిలాయని, చాలా మంది గాయపడ్డారని వివరించాడు.
అక్కడ ఉన్నవారంతా సాధారణ పౌరులేనని పేర్కొన్నాడు.
వివరాలు
ఇరాన్‌పై మరోసారి దాడులు చేపట్టిన అమెరికా
మరోవైపు ఇరాన్‌పై అమెరికా సైన్యం తాజాగా మరోసారి దాడులు చేపట్టినట్లు ప్రకటించింది.
'ఇరాన్ సైనిక లక్ష్యాల'పై ఈ దాడులు చేసినట్లు అమెరికా వెల్లడించింది.
హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) దాడులకు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
ఇరాన్‌కు చెందిన వైమానిక రక్షణ కేంద్రాలు, రాడార్ వ్యవస్థలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన ఆస్తులు, సైనిక స్థావరాలు, సముద్రంలో గనులు ఏర్పాటు చేసే సామర్థ్యానికి సంబంధించిన కేంద్రాలు, కమ్యూనికేషన్ కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యం పేర్కొంది.
వారాంతంలో ఇరాన్, అమెరికా మధ్య జరిగిన పరస్పర దాడుల తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
వివరాలు
ప్రాథమిక పాఠశాలపై దాడి
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
తాజా అమెరికా దాడులకు ప్రతిస్పందిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బఘాయీ స్పష్టం చేశారు.
గతంలో జరిగిన దాడులతో తాజా ఘటనను వేరు చేసి చూడలేమని ఆయన అన్నారు.
యుద్ధం ప్రారంభమైన తొలిరోజే మినాబ్, లామెర్డ్ నగరాలపై జరిగిన దాడులను ఆయన ప్రస్తావించారు.
మినాబ్‌లో అమెరికా బలగాలు ఓ ప్రాథమిక పాఠశాలపై దాడి చేయడంతో 150 మందికి పైగా మరణించారని, లామెర్డ్‌లోని ఓ క్రీడా హాల్‌పై దాడిలో కనీసం 21 మంది మృతి చెందారని ఆయన ఆరోపించారు.
వివరాలు
ప్రతిదాడులకు దిగిన ఇరాన్ సైన్యం
కుహెస్తాక్‌తో పాటు దక్షిణ ఇరాన్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ పేలుళ్లు సంభవించినట్లు అర్ధ ప్రభుత్వ వార్తా సంస్థ తస్నీమ్ తెలిపింది.
కోనారక్, బందర్ అబ్బాస్, ఖెష్మ్ దీవి ప్రాంతాల్లోనూ పేలుళ్లు జరిగినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఇరాన్ సైన్యం కూడా ప్రతిదాడులకు దిగినట్లు ప్రకటించింది.
జోర్డాన్, బహ్రెయిన్, ఇరాక్‌లోని అమెరికా స్థావరాలు, ఆస్తులపై దాడులు చేసినట్లు తెలిపింది.
మరోవైపు కువైట్ తమ గగనతలంలోకి వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది.