Trump - Iran: ఇరాన్‌కు ప్రతిదాడి చేసే సామర్థ్యం ఇంకా ఉంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఇరాన్‌కు ఇంకా ప్రతిదాడులు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, అది గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని తెలిపారు. అలాగే, అమెరికా చేపట్టిన సైనిక చర్యల వల్ల ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక యుద్ధ పరిస్థితులను నివారించగలిగామని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
ట్రంప్ ఏమన్నారంటే..
ట్రంప్ మాట్లాడుతూ, "ఇరాన్‌కు ఇంకా దాడులు చేసే శక్తి ఉంది. అయితే, అది పెద్ద స్థాయిలో లేదు. ప్రస్తుతం వారు యుద్ధంలో పైచేయి సాధించే పరిస్థితిలో లేరు. అయినప్పటికీ, ఎదురుదాడులకు పాల్పడే అవకాశం ఉంది. ఇటీవల హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ నౌకను లక్ష్యంగా చేసుకుని నాలుగు డ్రోన్లను ప్రయోగించారు. వాటిలో మూడు డ్రోన్లను మా బలగాలు విజయవంతంగా కూల్చివేశాయి. ఒక డ్రోన్ మాత్రం నౌకను తాకడంతో కొంత నష్టం జరిగింది" అని వెల్లడించారు. ఇంతకుముందు కూడా టెహ్రాన్ ఈ తరహా దాడులకు పాల్పడటం బాధ్యతారాహిత్య చర్య అని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
వివరాలు
శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోంది: జేడీ వాన్స్
తాజా పరిణామాలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన చేసిన పోస్టులో, అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని తమ దేశం పూర్తిగా గౌరవిస్తోందని, అయితే ఇరాన్ మాత్రం దానిని ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. "ఒప్పందానికి సంబంధించి ఏవైనా విభేదాలు ఉంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ, దాడులకు దిగడం సరైన మార్గం కాదు. హింసకు ప్రతిస్పందన కూడా హింసగానే ఉంటుంది" అని ఆయన పేర్కొంటూ, పరోక్షంగా ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేశారు.
వివరాలు
అమెరికా దాడుల వీడియో విడుదల..
హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న విలువైన వాణిజ్య నౌకపై శుక్రవారం ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిన నేపథ్యంలో, అమెరికా ప్రతీకార చర్యలకు దిగింది. హర్మూజ్ సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణులు, డ్రోన్ల నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. అలాగే, శాంతి ఒప్పందం అమలుపై తమ దేశం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, దానిని సమర్థంగా అమలు చేసేందుకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని అమెరికా స్పష్టం చేసింది.
వివరాలు
అమెరికాపై తీవ్ర విమర్శలు చేసిన ఇరాన్..
అమెరికా చేపట్టిన తాజా దాడులను ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిషన్ అధిపతి ఇబ్రహీం అజీజీ తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ, "చర్చలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా మరోసారి మా దేశంపై దాడికి పాల్పడింది. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం పట్ల తమకు ఎలాంటి నిబద్ధత లేదని అమెరికా అధ్యక్షుడు మరోసారి నిరూపించారు. ఈ నిర్లక్ష్యపూరిత చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇకపై ఇలాంటి ఆరోపణలు, నిందలు మాపై ప్రభావం చూపవు" అని హెచ్చరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
https://t.co/CckXLJSpah pic.twitter.com/NoMQ7cNtN5
— U.S. Central Command (@CENTCOM) June 27, 2026