Iran: ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం.. యుద్ధం విస్తరిస్తుందంటూ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందం కుదరకపోతే భారీ స్థాయిలో దాడులు చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించగా.. దీనికి తామూ వెనుకాడబోమని ఇరాన్ స్పష్టం చేసింది. తమ దేశంపై మరోసారి దాడులు జరిగితే యుద్ధం పశ్చిమాసియా ప్రాంతం దాటి మరింత విస్తరించే అవకాశముందని ఇరాన్ పార్లమెంటరీ ప్రిసైడింగ్ బోర్డు సభ్యుడు అలీరెజా సలీమీ హెచ్చరించారు. ఇక హర్మూజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తమ నౌకాదళ సమన్వయంతో కేవలం 24 గంటల్లోనే 26 నౌకలు హర్మూజ్ మార్గాన్ని దాటినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
వివరాలు
ఇరాన్ అధ్యక్షుడిని కలిసిన పాక్ హోం మంత్రి
మరోవైపు పాకిస్థాన్ హోం మంత్రి మొహ్‌సిన్ నక్వీ బుధవారం టెహ్రాన్‌లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌ను కలిశారు. ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో అమెరికా-ఇరాన్ మధ్య మరికొన్ని గంటల్లో కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.