Iran: నిరసనల్లో పాల్గొన్న కవలలు.. ఒకరికి ఉరి, మరొకరికి 25 ఏళ్ల జైలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న 19ఏళ్ల కవల సోదరీమణులు తారనెహ్ రహీమి,రొమినా రహీమిలకు విషాదకర పరిస్థితులు ఎదురయ్యాయి. నాలుగు నెలల పాటు వారి తల్లి మార్జియె నూర్మొహమ్మది తమ కుమార్తెలు ఎక్కడ ఉన్నారో తెలియక ఆసుపత్రులు,కోర్టులు,ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. జనవరిలో ఇస్ఫహాన్‌లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న కొద్ది రోజులకే ముసుగులు ధరించిన వ్యక్తులు వారి ఇంటి నుంచి ఇద్దరినీ తీసుకెళ్లారు. జనవరిలో 8,9 తేదీల్లో ఇస్ఫహాన్‌లో జరిగిన ఆందోళనల్లో తారనెహ్,రొమినా పాల్గొన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. సుమారు నెల రోజుల తర్వాత రాత్రివేళ కొందరు వ్యక్తులు వారి ఇంటికి వచ్చి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సభ్యులని కుటుంబానికి తెలిసింది.
వివరాలు
జైలులో గాయాలతో కనిపించిన సోదరీమణులు
అయితే వారిని ఎక్కడికి తీసుకెళ్లారో కుటుంబ సభ్యులకు మొదట్లో తెలియలేదు. ఆసుపత్రులు, కోర్టుల చుట్టూ తిరిగి ఆరా తీసినా వారి జాడ తెలియలేదు.
చివరికి మే నెలలో తారనెహ్, రొమినాలు ఇస్ఫహాన్‌లోని డౌలతాబాద్ జైలులో ఉన్నారని తల్లికి సమాచారం వచ్చింది.
అక్కడ కుమార్తెలను కలిసిన ఆమె వారిని చూసి షాక్‌కు గురయ్యారు.
వారి ముఖాలు వాచిపోయి, శరీరమంతా గాయాల గుర్తులు కనిపించాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
మోచేతులు,వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయని, కాళ్లు కూడా దెబ్బతిన్నాయని.. జుట్టు కూడా చాలా వరకు ఊడిపోయిందని చెప్పారు."
జుట్టు పట్టుకుని ఒక గది నుంచి మరో గదికి ఈడ్చుకెళ్లేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇద్దరినీ కొంతకాలం ఏకాంత నిర్బంధంలోనూ ఉంచినట్లు తెలిపారు.
వివరాలు
బెదిరింపులు.. చిత్రహింసలు.. చివరకు కఠిన శిక్షలు
తారనెహ్ తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించేందుకు చిత్రహింసలకు గురిచేశారని కోర్టులో న్యాయవాదులు చెప్పినట్లు ది గార్డియన్ నివేదించింది.
అంతేకాకుండా రొమినా ముందే ఆమె సోదరిపై లైంగిక దాడి చేస్తామని జైలు అధికారులు బెదిరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అయితే నిరసనల సమయంలో సోదరీమణులు హింసకు పాల్పడ్డారనే ఆధారాలను కోర్టులో చూపించలేదని కుటుంబం తెలిపింది.
అంతకుముందు వారు ఎలాంటి నిరసనల్లోనూ పాల్గొనలేదని పేర్కొంది.
తారనెహ్‌కు జనవరి నిరసనల్లో పాల్గొన్నందుకు ఉరిశిక్ష విధించారు. రొమినాకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది.
శిక్షలు ఖరారైన తర్వాత ఇద్దరినీ కుటుంబ సభ్యులు మళ్లీ చూడలేదని ది గార్డియన్ తెలిపింది.
వివరాలు
వందల మందికి మరణశిక్ష.. కొనసాగుతున్న అణచివేత
నాలుగు నెలల పాటు కుమార్తెల కోసం వెతికిన తల్లి.. చివరకు వారిని జైలులో చూసేసరికి గుర్తుపట్టలేనంతగా మారిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇరాన్‌లో నిరసనలను అణచివేసే చర్యల్లో భాగంగా మరణశిక్షలు అమలు చేస్తున్న సమయంలో ఈ కవల సోదరీమణుల కేసు వెలుగులోకి వచ్చింది.
2026లో ఇరాన్ 500 మందికి పైగా ఉరిశిక్షలు అమలు చేసిందని, వారిలో జనవరి నిరసనలకు సంబంధం ఉన్న కనీసం 29 మంది ఉన్నారని ది గార్డియన్ పేర్కొంది.
ఉరిశిక్షకు గురైన వారిలో కనీసం 16 మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది.
మరోవైపు వందలాది మంది మరణశిక్షను ఎదుర్కొంటున్నారని, మరికొందరికి ఇప్పటికే ఆ శిక్షలు విధించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
ఇరాన్‌లో పెరుగుతున్న ఉరిశిక్షలు
ఇస్ఫహాన్‌లోనే 70 మందికి పైగా మరణశిక్షను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
ఈ పరిణామాలపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. గత నెలలో బ్రిటన్‌తో పాటు మరో 30 దేశాలు ఇరాన్‌లో అమలు చేస్తున్న ఉరిశిక్షలను ఖండిస్తూ ప్రకటనపై సంతకాలు చేశాయి.
రహీమి సోదరీమణుల కేసు.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఇరాన్‌లో మరణశిక్షను ఎలా ఉపయోగిస్తున్నారో చూపించే మరో ఉదాహరణగా మారింది.
అమెరికాలోని ఉటాలో నివసిస్తున్న వారి బంధువు మసూద్ నూర్మొహమ్మది మాట్లాడుతూ.. సోదరీమణులకు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం కుటుంబానికి చాలా కష్టంగా మారిందన్నారు.
వివరాలు
కవలల కేసుతో కుటుంబంలో తీరని వేదన
చట్టపరమైన అప్పీల్‌కు అవకాశం ఉన్నప్పటికీ ఇటీవలి అనేక ఉరిశిక్ష కేసుల్లో ఆ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని మసూద్ ఆరోపించారు.
ప్రజల్లో భయాన్ని నింపడమే ఈ చర్యల ఉద్దేశమని ఆయన అభిప్రాయపడ్డారు.
''మీరు ఎంత మంచివారైనా, నిర్దోషులైనా.. మిమ్మల్ని కూడా పట్టుకోగలమనే భయాన్ని ప్రజల్లో కలిగించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇకపై వీధుల్లోకి రావద్దనే సందేశాన్ని ఇస్తున్నారు'' అని ఆయన అన్నారు.
ఈ ఘటన ప్రభావం కుటుంబంపై తీవ్రంగా పడింది. తన తల్లి ఇప్పటికీ కుమార్తెల గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటోందని మసూద్ చెప్పారు.
''మా అమ్మ నాతోనే ఉంటోంది. నేను ఆమెను చూసిన ప్రతిసారీ.. ఆమె కన్నీళ్లు పెట్టుకోని క్షణం అంటూ ఉండదు'' అని మసూద్ తెలిపారు.
వివరాలు
ఇరాన్‌లో కొనసాగుతున్న అణచివేత
ఇరాన్‌లో నిరసనకారులపై కొనసాగుతున్న విస్తృత చర్యల్లో భాగంగానే కవల సోదరీమణుల కేసు వెలుగులోకి వచ్చింది.
2022లో జరిగిన 'వుమన్, లైఫ్, ఫ్రీడం' నిరసనల్లో కాల్పులకు గురై ఒక కంటిచూపు కోల్పోయిన అలీ జరేయి దూజ్‌దరెస్సీ.. జర్మనీ నుంచి ఇరాన్‌కు తిరిగి వచ్చిన తర్వాత మరణశిక్షకు గురైనట్లు సెప్టెంబర్ 1న ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదించింది.
రాజకీయ కార్యకలాపాలు, తప్పుడు వార్తల ప్రచారం, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం తదితర ఆరోపణలతో టెహ్రాన్ రివల్యూషనరీ కోర్టు ఆయనను దోషిగా తేల్చినట్లు పేర్కొంది.
వివరాలు
ఇరాన్‌లో కొనసాగుతున్న అణచివేత
వ్యతిరేక స్వరాలను అణచివేసేందుకు ఇరాన్ అధికారులు మరణశిక్షను ఆయుధంగా ఉపయోగిస్తున్నారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది.
జనవరి 2026 నిరసనల్లో అరెస్టయిన 29 మందిని మార్చి 19 నుంచి ఉరితీశారని ఇరాన్ హ్యూమన్ రైట్స్ తెలిపింది.
2022 నిరసనలకు సంబంధించిన మరో ఇద్దరికి కూడా ఉరిశిక్ష అమలు చేసినట్లు పేర్కొంది. ఇంకా వందలాది మంది మరణశిక్షను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది.
అయితే రహీమి కుటుంబానికి ఈ భారీ గణాంకాల కంటే తమ ఇద్దరు కుమార్తెలకు జరిగిన పరిస్థితే ముఖ్యమైనది.
తారనెహ్‌కు ఉరిశిక్ష, రొమినాకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. నెలల తరబడి కుమార్తెల కోసం వెతికిన వారి తల్లి.. ఇప్పుడు మళ్లీ వారిని ఎప్పుడు చూడగలమోనని ఎదురుచూస్తున్నారు.