LOADING...
Iran: హర్మూజ్‌పై ఇరాన్ యూటర్న్.. శత్రు నౌకలకు మాత్రం నో ఎంట్రీ!
హర్మూజ్‌పై ఇరాన్ యూటర్న్.. శత్రు నౌకలకు మాత్రం నో ఎంట్రీ!

Iran: హర్మూజ్‌పై ఇరాన్ యూటర్న్.. శత్రు నౌకలకు మాత్రం నో ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ తన వైఖరిలో కొంత మార్పు చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. శత్రు దేశాలకు సంబంధించిన నౌకలకు మాత్రం అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ సముద్ర సంస్థ(IMO)వద్ద ఇరాన్ ప్రతినిధి అలీ మౌసావి ఈవిషయాన్ని వెల్లడించారు. ఇరాన్‌కు శత్రువులుగా భావించే దేశాలకు చెందిన నౌకలు కాకుండా, మిగతా నౌకలు టెహ్రాన్‌తో భద్రతా సమన్వయం చేసుకుని జలసంధి గుండా ప్రయాణించవచ్చని తెలిపారు. ఇది జరిగిన కొన్ని గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.

వివరాలు

ఈ ఏడాది ఫిబ్రవరి 28న హర్మూజ్ జలసంధి మూసీవేత

ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సముద్ర భద్రత, నావికుల రక్షణ కోసం ఐక్యరాజ్యసమితి సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మౌసావి పేర్కొన్నారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులకు అమెరికా, ఇజ్రాయెల్ దాడులే మూల కారణమని ఆయన ఆరోపించారు. రాజనీతిక మార్గమే ఇరాన్‌కు ప్రాధాన్యం. అయితే దాడులు పూర్తిగా ఆగిపోవడం, పరస్పర నమ్మకం పెరగడం అత్యంత కీలకమని ఆయన అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే.

వివరాలు

అమెరికా, ఇజ్రాయెల్ లకు ఒక్క లీటర్ చమురు కూడా చేరనివ్వం

ప్రపంచ చమురు, ద్రవీభవించిన సహజ వాయువు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ వారి మిత్రదేశాలకు ఒక్క లీటర్ చమురు కూడా చేరనివ్వమని ఇరాన్ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ దాడుల భయం కారణంగా చాలా నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించడానికి వెనుకంజ వేస్తున్నాయి. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ పరిస్థితుల్లో నౌకలకు రక్షణగా సముద్ర దళ కూటమిని ఏర్పాటు చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ, నాటో మిత్రదేశాల్లో చాలా దేశాలు ఇరాన్‌పై సైనిక చర్యల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు.

Advertisement