Iran: అమెరికా దాడులతో అప్రమత్తమైన ఇరాన్.. విద్యుత్ వినియోగంపై కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడుల ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ విద్యుత్ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు జరిగాయని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. పరిస్థితుల దృష్ట్యా దేశ ప్రజలు అవసరమైనప్పుడే విద్యుత్‌ను వినియోగించాలని, వీలైనంత మేర పొదుపు చేయాలని ఆ దేశ విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత, విద్యుత్ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు జరిగాయని ఇరాన్ అధికారికంగా అంగీకరించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
దక్షిణ ఇరాన్ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తం ఉండాలి: ఇరాన్
దాడుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న దక్షిణ ఇరాన్ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, విద్యుత్ వ్యవస్థలపై దాడుల కారణంగా సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది.
అందువల్ల ప్రజలు అత్యవసర అవసరాలకు మాత్రమే విద్యుత్‌ను వినియోగించాలని అధికారులు సూచించారు.
అయితే దాడుల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు లక్ష్యంగా మారాయా? లేక విద్యుత్ ప్రసార, సరఫరా వ్యవస్థలపై దాడులు జరిగాయా? అనే అంశాలపై ఇరాన్ ప్రభుత్వం స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.
వివరాలు
అమెరికా దళాలు ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు
ఇదిలా ఉండగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య పోటీ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే హెచ్చరించారు.
ఆ హెచ్చరికలకు అనుగుణంగానే ప్రస్తుతం అమెరికా దళాలు ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది.