Iran-US War: మరోసారి భగ్గుమన్న ఇరాన్-అమెరికా యుద్ధం.. ఖర్గ్ ద్వీపం వద్ద భారీ పేలుళ్లు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం తీవ్రంగా మారుతోంది. కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు స్తబ్దుగా కనిపించడంతో.. పెద్దగా దాడులు జరగకపోవడంతో శాంతి ఒప్పందం దిశగా పరిస్థితులు వెళ్తున్నాయని అంతా భావించారు. అయితే అనూహ్యంగా పశ్చిమాసియా మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాన్‌లోని కీలక చమురు కేంద్రం 'ఖర్గ్ ఐలాండ్' సమీపంలో శనివారం పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. అమెరికా దాడిలో ఓ చమురు ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్‌కు చెందిన నూర్‌న్యూస్ తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
వివరాలు
ట్యాంకర్‌పై నాలుగు ప్రాజెక్టైల్స్‌తో దాడి?
ఇరాన్‌కు చెందిన మరో వార్తా సంస్థ కథనం ప్రకారం.. ట్యాంకర్‌లో సరుకును అన్‌లోడ్ చేస్తున్న సమయంలో దానిపై నాలుగు ప్రాజెక్టైల్స్ దూసుకొచ్చాయి.
అయితే ఇరాన్ సెమీ అఫీషియల్ ఫార్స్ న్యూస్ మాత్రం ఖర్గ్ ఐలాండ్ సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినప్పటికీ.. ఎలాంటి పొగలు కనిపించలేదని తెలిపింది.
అయితే ఈ మీడియా కథనాలను ఇరాన్ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.
వివరాలు
ఖర్గ్ ఐలాండ్‌పై దాడులా?
తాజా ఘటన నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఘర్షణలో మరో కీలక పరిణామంగా మారింది. ముఖ్యంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' చుట్టూ ఇటీవలి రోజుల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఆగస్టు 30న అమెరికా ఇరాన్ లక్ష్యాలపై మరో దఫా దాడులు చేసింది. హార్ముజ్ జలసంధికి సమీపంలోని 'లారక్ ఐలాండ్'లో ఇరాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా తెలిపింది.
సముద్ర మార్గంలో గనులు అమర్చడం, నౌకాయానాన్ని బెదిరిస్తున్న ఇరాన్ బలగాలే తమ లక్ష్యాలని వాషింగ్టన్ పేర్కొంది. దీనికి ప్రతిగా ఇరాన్.. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసినట్లు సమాచారం.