Mohsen Rezaei: ట్రంప్ చర్యలతో అణ్వాయుధాల ముప్పు పెరుగుతోంది.. ఇరాన్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి ప్రపంచంలో మరోసారి అణ్వాయుధాల పోటీకి దారితీస్తోందని ఇరాన్ ఆరోపించింది. అమెరికా చేపడుతున్న సైనిక చర్యలు ప్రపంచ అణు భద్రతను తీవ్రంగా దెబ్బతీశాయని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి మొహసెన్ రెజాయ్ విమర్శించారు. ట్రంప్ చర్యల కారణంగా ఇతర దేశాల్లోనూ భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. అణ్వాయుధాలు లేని దేశాలు తమ భద్రత కోసం వాటిని సమీకరించుకోవాలనే ఆలోచనకు అమెరికా విధానాలు ఊతమిస్తున్నాయని ఆరోపించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల వ్యాప్తి ప్రమాదం మరింత పెరుగుతోందని హెచ్చరించారు. అమెరికా ఒత్తిళ్లకు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గబోదని రెజాయ్ స్పష్టం చేశారు.
వివరాలు
చర్చల పునరుద్ధరణకు ఈజిప్ట్ ప్రయత్నాలు
ఇరాన్‌పై అమెరికా చేపట్టే చర్యలకు సహకరించే పొరుగు దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రంప్ మరోసారి సైనిక చర్యకు దిగితే ఇరాన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఈజిప్ట్ దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో ఈజిప్ట్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దౌత్య మార్గంలో సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఈజిప్ట్ ప్రయత్నాలు చేస్తోంది.