Loading...
USA-Iran War: అమెరికా సైనికులను బంధించండి.. పశ్చిమాసియాలోని స్థావరాలను స్వాధీనం చేసుకోండి: ఇరాన్ నేత వ్యాఖ్యలు
అమెరికా సైనికులను బంధించండి.. పశ్చిమాసియాలోని స్థావరాలను స్వాధీనం చేసుకోండి: ఇరాన్ నేత వ్యాఖ్యలు

USA-Iran War: అమెరికా సైనికులను బంధించండి.. పశ్చిమాసియాలోని స్థావరాలను స్వాధీనం చేసుకోండి: ఇరాన్ నేత వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2026
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పరస్పరం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని పక్కనబెట్టి ఇరు దేశాలు మళ్లీ దాడులకు దిగుతున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇదే సమయంలో రెండు దేశాల నేతలు చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మనుచెహర్ మొత్తకి సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకుని, అక్కడ విధులు నిర్వహిస్తున్న సుమారు 100 మంది అమెరికా సైనికులను బంధించి ఇరాన్‌కు తీసుకురావాలని ఆయన సైన్యానికి పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైతే భూతల దాడులు కూడా చేపట్టాలని సూచించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

వివరాలు 

అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందంపై తీవ్ర విమర్శలు

ఇది మనుచెహర్ నుంచి వచ్చిన తొలి వివాదాస్పద వ్యాఖ్య కాదు. గతంలో కూడా ఆయన ఇదే తరహా ప్రకటనలు చేశారు.

ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీపై జరిగిన పరిణామాలకు ప్రతీకారం తీర్చుకోవాలని అప్పట్లో ఆయన పిలుపునిచ్చారు.

అలాగే అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని మోసపూరిత వ్యూహంగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.

ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు కూడా అమెరికా ముందుగానే రచించిన ప్రణాళికలో భాగమేనని మనుచెహర్ ఆరోపించారు.

రెండు లేదా మూడు రోజుల్లో తమ వ్యూహాన్ని అమలు చేసి ఇస్లామిక్ రిపబ్లిక్‌కు ముగింపు పలకాలని అమెరికా భావించిందని, అయితే ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఖర్గ్ ఐలాండ్‌ను అమెరికా సీజ్ చేసే అవకాశం 

అదేవిధంగా ఇరాన్‌పై జరిగిన దాడుల విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు అమెరికా ఇరాన్‌కు చెందిన డ్రోన్, క్షిపణి నిల్వలు, హర్మూజ్ జలసంధికి సమీపంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోందని సమాచారం.

అంతేకాకుండా, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావించే ఖర్గ్ ఐలాండ్‌ను సీజ్ చేసే అవకాశముందని అమెరికా హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఈ తరుణంలో మనుచెహర్ మొత్తకి చేసిన వ్యాఖ్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT