Mojtaba Khamenei: అమెరికా, ఇజ్రాయెల్ నష్టపరిహారం చెల్లించాలి.. ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తుండగా.. అవసరమైతే మరోసారి సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరువైపులా వెలువడుతున్న ప్రకటనలతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఆందోళనకరంగా మారుతున్నాయి. శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ, ఆ దేశ న్యాయవ్యవస్థ చీఫ్ ఘోలమ్హొస్సేన్ మొహ్సేనీ-ఎజెయితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్‌కు జరిగిన భౌతిక నష్టంతో పాటు ఇతర నష్టాలకు కూడా పరిహారం పొందేందుకు అన్ని విధాలా కృషి చేయాలని ఖమేనీ సూచించారు.
వివరాలు
ఇరాన్ హక్కులను కాపాడటంలో రాజీ పడొద్దని సూచన
తమ దేశానికి నష్టం కలిగించిన వారిని బాధ్యులుగా నిలబెట్టి,తగిన పరిహారం రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇరాన్ ప్రజల హక్కుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీకి తావివ్వకూడదని స్పష్టం చేశారు.
అవినీతిని అరికట్టడం,న్యాయవ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం వంటి అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు.
మరోవైపు, శుక్రవారం ఫ్లోరిడాలో నిర్వహించిన ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఇరాన్ పెద్దగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందని పేర్కొన్న ఆయన.. అమెరికా తలచుకుంటే ఆ దేశ చమురు మొత్తాన్ని స్వాధీనం చేసుకోవచ్చని,అవసరమైతే మొత్తం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇరాన్‌తో అమెరికా సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలపై చర్చకు దారితీశాయి.
వివరాలు
ఇరాన్‌పై మళ్లీ 'ఎపిక్ ఫ్యూరీ' తప్పదని ట్రంప్ హెచ్చిరిక
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 'ఎపిక్ ఫ్యూరీ' పేరుతో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభించిన విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు.
ఇదే తరహాలో మరో చిన్న స్థాయి 'ఎపిక్ ఫ్యూరీ' ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందంటూ సంకేతాలిచ్చారు.
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్‌పై మరోసారి దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.
అయితే, ట్రంప్ నిజంగానే మరో సైనిక చర్యకు ఆదేశిస్తారా? లేక దౌత్యపరమైన మార్గాలను ఎంచుకుంటారా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని అమెరికా మీడియా పేర్కొంటోంది.
వివరాలు
అంతర్జాతీయ చమురు సరఫరాపైనా ప్రభావం
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇతర నగరాలపై దాడులు చేశాయి.
దీనికి ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది.
అంతేకాకుండా, అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిపై తన పట్టును బిగించింది.
తాజా పరిణామాలు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యే అవకాశాలను పెంచుతున్నాయి.
ఈ పరిస్థితులు పశ్చిమాసియా భద్రతతో పాటు అంతర్జాతీయ చమురు సరఫరాపైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.