Loading...
China: 140 కోట్ల మందిపై చైనా నిఘా..? అమెరికా పత్రిక సంచలన కథనం!
140 కోట్ల మందిపై చైనా నిఘా..? అమెరికా పత్రిక సంచలన కథనం!

China: 140 కోట్ల మందిపై చైనా నిఘా..? అమెరికా పత్రిక సంచలన కథనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా ప్రజలపై నిఘా(China Surveillance)కొనసాగిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ నిఘాలో చైనా పౌరులతో పాటు, ఆ దేశాన్ని సందర్శించిన విదేశీయుల వివరాలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. చైనా తన ప్రజలపై ఎలా నిఘా నిర్వహిస్తుందో తెలుసుకునేందుకు ఈ ఏడాది జనవరిలో సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మార్క్ హోఫర్ ఇంటర్నెట్‌లో అన్వేషణ చేపట్టారు. ఈ క్రమంలో ఆయనకు 'డైనమిక్ కంట్రోల్ ప్లాట్‌ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్' అనే వెబ్‌సైట్ కనిపించింది. ఆ వెబ్‌సైట్‌లో తన పేరు, ఫొటో, పాస్‌పోర్ట్ నంబర్, గతంలో చైనా పర్యటన సందర్భంగా ఉపయోగించిన మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు కనిపించడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు.

వివరాలు

విదేశీయుల వ్యక్తిగత వివరాలూ నమోదు

ఆ వెబ్‌సైట్‌లో ముఖ్యంగా చైనాలోని జాంగ్‌జియాకోవు నగరాన్ని సందర్శించిన విదేశీయుల (Foreigners) వివరాలు పెద్దఎత్తున ఉన్నట్లు గుర్తించారు.

ఈ జాబితాలో భారత్, తైవాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, పాకిస్థాన్, సూడాన్ దేశాలకు చెందిన పౌరుల సమాచారం నమోదై ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు జాంగ్‌జియాకోవులోని హెబే నార్త్ యూనివర్సిటీలో చేరిన విదేశీ విద్యార్థుల వివరాలు కూడా అందులో ఉన్నాయి.

వీరిలో భారత్, పాకిస్థాన్‌కు చెందిన విద్యార్థులే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం.

వివరాలు

కెమెరాలు, ఫోన్ సిగ్నల్స్‌తో నిరంతర ట్రాకింగ్

వెబ్‌సైట్‌లో వ్యక్తిగత వివరాలతో పాటు, వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి చేస్తున్నారనే సమాచారం కూడా నమోదై ఉంది.

ఈ వ్యక్తులందరినీ చైనా అధికారులు సీసీటీవీ కెమెరాలు (Cameras), ఫోన్ సిగ్నల్స్ (Phone Signals) ద్వారా ట్రాక్ చేస్తున్నట్లు కథనం పేర్కొంది.

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విదేశీయులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిన తర్వాత కూడా ఈ నిఘా కొనసాగుతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.

ADVERTISEMENT

వివరాలు

పోలీసులతో సంబంధాలున్న సంస్థ?

చైనాలోని పోలీసు శాఖలకు రోబోటిక్స్, నిఘా పరికరాలను సరఫరా చేసే 'ఆరిజిన్ డైనమిక్' అనే సంస్థకు కూడా ఈ వెబ్‌సైట్‌తో సంబంధాలు ఉన్నట్లు కథనం వెల్లడించింది.

ఈ డేటా అక్కడి పోలీసులకు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

ప్రజలు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు, ఏ విమానం లేదా రైలులో ప్రయాణించారు, సీటు నంబర్ వంటి వివరాలు కూడా ఈ డేటాబేస్‌లో నమోదై ఉన్నట్లు పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

హాంకాంగ్ నిరసనల తర్వాత పెరిగిన నిఘా

2019లో హాంకాంగ్‌లో జరిగిన భారీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల అనంతరం చైనా ప్రభుత్వం నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసినట్లు కథనం పేర్కొంది.

దేశ ప్రజలతో పాటు, వారి విదేశీ భాగస్వాములపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగించినట్లు వెల్లడించింది. అయితే ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం మే నెలలో పూర్తిగా అదృశ్యమైంది.

అంతకుముందే సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మార్క్ హోఫర్ ఆ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.

కాగా ఈ కథనాలపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.

ADVERTISEMENT