Loading...
Cheget Nuclear Briefcase: పుతిన్ వెంట నల్లటి బ్రీఫ్‌కేస్.. అణుదాడికి సంకేతమా? అసలు విషయం ఇదే!
పుతిన్ వెంట నల్లటి బ్రీఫ్‌కేస్.. అణుదాడికి సంకేతమా? అసలు విషయం ఇదే!

Cheget Nuclear Briefcase: పుతిన్ వెంట నల్లటి బ్రీఫ్‌కేస్.. అణుదాడికి సంకేతమా? అసలు విషయం ఇదే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ దేశాల అధినేతలు ఒకే వేదికపైకి వస్తున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెంట కనిపించిన ఓ నల్లటి బ్రీఫ్‌కేస్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. చైనాలోని షెన్‌జెన్‌లో జరుగుతున్న ఏపెక్ (APEC) సదస్సుకు పుతిన్ హాజరైన సందర్భంగా రష్యా నావికాదళ అధికారులు ఈ ప్రత్యేకమైన బ్రీఫ్‌కేస్‌ను ఆయన వెంట తీసుకెళ్లారు. దీంతో అసలు ఆ బ్యాగ్‌లో ఏముంది? దాని ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తి మొదలైంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇది సాధారణ బ్రీఫ్‌కేస్ కాదు. రష్యా అణ్వాయుధాల కమాండ్ వ్యవస్థలో కీలకంగా పనిచేసే 'చెగెట్' (Cheget) న్యూక్లియర్ బ్రీఫ్‌కేస్ అని ఓ రష్యా అధికారి ధ్రువీకరించినట్లు సమాచారం.

వివరాలు 

అసలు చెగెట్ అంటే ఏమిటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో పుతిన్ సమావేశం కానున్న సమయంలో ఇది కనిపించడం మరింత ఆసక్తిని పెంచింది.

ముఖ్యంగా అణ్వాయుధాల నియంత్రణ, అంతర్జాతీయ భద్రత వంటి అంశాలు చర్చకు వస్తున్న నేపథ్యంలో ఈ బ్రీఫ్‌కేస్‌పై ప్రపంచ దేశాల దృష్టి పడింది.

పుతిన్ వెంట కనిపించిన నల్లటి బ్రీఫ్‌కేస్‌ను 'చెగెట్' అని పిలుస్తారు. ఇది రష్యా అణు కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం.

దేశాధ్యక్షుడు సైనిక నాయకత్వంలోని ఉన్నతాధికారులతో సురక్షితంగా సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి, అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన అధికారిక ఆదేశాలను పంపడానికి దీన్ని ఉపయోగిస్తారు.

అయితే ఈ బ్రీఫ్‌కేస్‌లో ఓ బటన్ నొక్కగానే అణు క్షిపణులు నేరుగా ప్రయోగించబడతాయని అనుకోవడం పొరపాటే.

వివరాలు 

బ్రీఫ్‌కేస్‌లో ఏముంటుంది?

ఇది స్వయంగా క్షిపణులను ప్రయోగించే పరికరం కాదు. అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన నిర్ణయాలు, అనుమతులు, సైనిక కమాండ్ వ్యవస్థ మధ్య సమాచార ప్రసారానికి ఉపయోగపడుతుంది.

అమెరికా అధ్యక్షుడి వెంట ఉండే 'న్యూక్లియర్ ఫుట్‌బాల్' వ్యవస్థతో దీనిని కొంతవరకు పోల్చవచ్చు.

చెగెట్ బ్రీఫ్‌కేస్‌లో ఉండే పూర్తి సాంకేతిక వివరాలను రష్యా ప్రభుత్వం ఇప్పటివరకు బహిరంగంగా వెల్లడించలేదు.

అయితే 2019లో రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జ్వెజ్డా (Zvezda) టెలివిజన్ ఛానల్ ఈ బ్రీఫ్‌కేస్‌కు సంబంధించిన పాత నమూనాను ప్రజలకు చూపించింది.

ADVERTISEMENT

వివరాలు 

బ్రీఫ్‌కేస్‌లో ఏముంటుంది?

ఆ ప్రదర్శనలో బ్రీఫ్‌కేస్‌లో తెలుపు రంగులో ఉన్న 'లాంచ్' బటన్, ఎరుపు రంగులో ఉన్న 'క్యాన్సిల్' బటన్ కనిపించాయి.

వీటితోపాటు కొన్ని నియంత్రణ వ్యవస్థలు, సమాచార ప్రసారానికి సంబంధించిన పరికరాలు కూడా ఉన్నట్లు వెల్లడైంది.

సైనిక సమాచార వ్యవస్థతో అనుసంధానమై ఉండే ఈ పరికరం ద్వారా రష్యా అధ్యక్షుడు ఉన్నత స్థాయి సైనిక అధికారులతో సంప్రదింపులు జరపవచ్చు.

అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన ఆదేశాలను అధికారిక కమాండ్ వ్యవస్థకు చేరవేయవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

చెగెట్ అనే పేరు ఎలా వచ్చింది?

రష్యాలోని కాకసస్ పర్వత శ్రేణుల్లో ఉన్న 'చెగెట్' అనే పర్వతం పేరు ఆధారంగా ఈ న్యూక్లియర్ బ్రీఫ్‌కేస్‌కు ఆ పేరు పెట్టారు.

దీని రూపకల్పన సోవియట్ యూనియన్ పాలనలోనే ప్రారంభమైంది.

1980వ దశకంలో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. మిఖాయిల్ గోర్బచేవ్ అధికారంలోకి వచ్చిన 1985లో దీనిని అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి.

1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పటికీ ఈ వ్యవస్థను రష్యా కొనసాగించింది. దేశ అణు కమాండ్ వ్యవస్థలో దీనికి కీలక స్థానం కల్పించింది.

1999 డిసెంబర్‌లో అప్పటి అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ నుంచి వ్లాదిమిర్ పుతిన్‌కు అధ్యక్ష బాధ్యతలు బదిలీ అయిన సమయంలో అణ్వాయుధాల కమాండ్ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు.

వివరాలు 

చెగెట్‌ను నిజంగా ఎప్పుడైనా ఉపయోగించారా?

ఈ బ్రీఫ్‌కేస్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘటన 1995 జనవరి 25న చోటుచేసుకుంది.

అప్పట్లో బోరిస్ యెల్ట్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు. నార్వే,అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు 'బ్లాక్ బ్రాంట్' (Black Brant)అనే పరిశోధనా రాకెట్‌ను ప్రయోగించారు.

అయితే రష్యా రాడార్ వ్యవస్థ ఆ రాకెట్‌ను శత్రు దేశం నుంచి వస్తున్న బాలిస్టిక్ క్షిపణిగా పొరబడింది.

దీంతో రష్యా సైనిక వ్యవస్థలో ఒక్కసారిగా అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి.

పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధ్యక్షుడు యెల్ట్సిన్ అణు కమాండ్ వ్యవస్థను ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో చెగెట్ బ్రీఫ్‌కేస్‌ను యాక్టివేట్ చేసి,అందులోని సమాచారాన్ని పరిశీలించారు.

అయితే అది శత్రు దేశం ప్రయోగించిన క్షిపణి కాదని,పరిశోధన కోసం ప్రయోగించిన రాకెట్ మాత్రమేనని చివరకు గుర్తించారు.

వివరాలు 

ట్రంప్, జిన్‌పింగ్ సమావేశాల సమయంలో ఎందుకింత చర్చ?

దీంతో అణుదాడి ముప్పు తప్పింది.ఈ ఘటన రష్యా అణ్వాయుధాల చరిత్రలో అత్యంత కీలకమైన సంఘటనగా నిలిచిపోయింది.

ప్రస్తుతం పుతిన్ వెంట చెగెట్ బ్రీఫ్‌కేస్ కనిపించడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది.

చైనాలోని షెన్‌జెన్‌లో జరుగుతున్న ఏపెక్ సదస్సు సందర్భంగా ట్రంప్,పుతిన్,జిన్‌పింగ్‌లు పలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో అణ్వాయుధాల నియంత్రణ, ప్రపంచ భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

అయితే పుతిన్ వెంట న్యూక్లియర్ బ్రీఫ్‌కేస్ ఉండటాన్ని అణుదాడికి సిద్ధమవుతున్నారనే సంకేతంగా భావించకూడదు.

అధ్యక్షుడు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పటికీ అణు కమాండ్ వ్యవస్థను ఎప్పుడూ అందుబాటులో ఉంచడం రష్యా భద్రతా విధానంలో భాగం.

అందువల్ల ఈ బ్రీఫ్‌కేస్ కనిపించడం సాధారణ భద్రతా ఏర్పాట్లలో భాగంగానే చూడాలి.

వివరాలు 

ట్రంప్, జిన్‌పింగ్ సమావేశాల సమయంలో ఎందుకింత చర్చ?

మొత్తానికి బయటకు సాధారణ నల్లటి బ్రీఫ్‌కేస్‌లా కనిపించే చెగెట్ వెనుక రష్యా అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించిన అత్యంత కీలకమైన కమాండ్ వ్యవస్థ ఉంది.

అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన నిర్ణయాలు, సైనిక అధికారులతో సమాచార మార్పిడి వంటి కీలక బాధ్యతల్లో ఇది భాగస్వామిగా ఉంటుంది.

అందుకే పుతిన్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట కనిపించే ఈ బ్రీఫ్‌కేస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ADVERTISEMENT