Saudi Arabia: సౌదీ అణు బాంబు తయారు చేస్తుందా? అమెరికా రహస్య నివేదికలో కీలక అంశాలు!
ఈ వార్తాకథనం ఏంటి
అణ్వాయుధాల తయారీ విషయంలో పశ్చిమాసియా దేశాల మధ్య పోటీపై మరోసారి చర్చ మొదలైంది. సౌదీ అరేబియా (Saudi Arabia) అణ్వాయుధాల తయారీ దిశగా అడుగులు వేసే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అణు బాంబులను తయారు చేసేందుకు సౌదీ ఆసక్తి చూపించే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ అంశాన్ని అమెరికా కాంగ్రెస్ (US Congress)కు అందించిన తమ రహస్య నివేదికలో ప్రస్తావించినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వివరాలు
సౌదీకి యురేనియం సరఫరాపై ఒప్పందం
పౌర అవసరాల కోసం సౌదీ అరేబియాకు యురేనియం అందించేందుకు ఆ దేశంతో 30 ఏళ్ల సుదీర్ఘకాల ఒప్పందానికి ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఒప్పందంపై అమెరికా చట్టసభ సభ్యుల్లో కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
సౌదీకి యురేనియం శుద్ధి సాంకేతికతను అందిస్తే.. భవిష్యత్తులో అణ్వాయుధాల తయారీకి అవసరమైన సామర్థ్యం ఆ దేశానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
5 శాతం నుంచి 20 శాతానికి పెంచే అవకాశంపై చర్చ
ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాలో యురేనియం శుద్ధి 5 శాతం లోపే ఉండేలా పరిమితులు విధించారు.
అయితే భవిష్యత్తులో ఈ పరిమితిని 20 శాతం వరకు పెంచే అవకాశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
అయితే అణ్వాయుధాల తయారీకి సాధారణంగా 60-90 శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం అవసరమవుతుంది.
దీంతో సౌదీకి అందించే యురేనియం శుద్ధి సామర్థ్యంపై అమెరికా చట్టసభ సభ్యుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే..
ఇదిలా ఉండగా.. ఇరాన్ అణు బాంబులను తయారు చేస్తే భద్రతా కారణాల దృష్ట్యా తాము కూడా అణ్వాయుధాలను సమకూర్చుకోవాల్సి వస్తుందని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ గతంలో హెచ్చరించిన విషయం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఇరాన్ అణు సామర్థ్యం, సౌదీకి యురేనియం శుద్ధి సాంకేతికత అందుబాటులోకి రావడం వంటి పరిణామాలు పశ్చిమాసియాలో అణ్వాయుధాల అంశంపై మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.