Loading...
UN report warns: ఏఐతో ఐసిస్ ఉగ్ర ప్రచారం.. భారత్‌లో మహిళలు, చిన్నారులే లక్ష్యంగా రాడికలైజేషన్
ఏఐతో ఐసిస్ ఉగ్ర ప్రచారం.. భారత్‌లో మహిళలు, చిన్నారులే లక్ష్యంగా రాడికలైజేషన్

UN report warns: ఏఐతో ఐసిస్ ఉగ్ర ప్రచారం.. భారత్‌లో మహిళలు, చిన్నారులే లక్ష్యంగా రాడికలైజేషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసిస్, అల్‌ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల తీరును మార్చుకుంటున్నాయి. గతంలో భౌతిక దాడులకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ సంస్థలు.. ఇప్పుడు భావజాల ప్రచారం, రాడికలైజేషన్‌ను ప్రధాన ఆయుధాలుగా మలుచుకుంటున్నాయి. ఈ వ్యూహంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విస్తృతంగా వినియోగిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి (ఐరాస) తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలు, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని వారిని తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించింది.

వివరాలు 

వర్గాల వారీగా ప్రచార కంటెంట్‌ తయారీ

ఐరాసకు చెందిన కౌంటర్‌ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ (సీటీఈడీ) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఉగ్రవాద సంస్థలు ఏఐతోపాటు ముఖ్యంగా జెనరేటివ్‌ ఏఐ సాయంతో వివిధ వర్గాలకు సరిపోయే ప్రచార కంటెంట్‌ను వేగంగా రూపొందిస్తున్నాయని నివేదిక పేర్కొంది.

పురుషులు, మహిళలు, యువతులు, యువకులు, చిన్నారులు.. ఇలా ప్రతి వర్గం మానసిక స్థితి, ఆసక్తులు, బలహీనతలకు అనుగుణంగా సందేశాలను రూపొందించి వ్యాప్తి చేస్తున్నట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్‌ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఈ ప్రచారాన్ని మరింత విస్తరిస్తున్నాయని వివరించింది.

వివరాలు 

భారత్‌లో మహిళలు, చిన్నారులపై ప్రత్యేక దృష్టి

ఐసిస్, అల్‌ఖైదా సంస్థలు భారత్‌లోనూ ఏఐ ఆధారిత ప్రచారాన్ని ఉపయోగిస్తున్నాయని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు చెబుతున్నారు.

ముఖ్యంగా మహిళలు, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.

చిన్న వయసులోనే పిల్లల బలహీనతలను గుర్తించి, వాటిని ఆసరాగా చేసుకుని వారి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తున్నారని తెలిపారు.

భవిష్యత్తులో వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

అమ్మాయిలకు రక్షణ, గుర్తింపు పేరుతో ఎర

మహిళలు, యువతులను ఆకర్షించేందుకు రక్షణ, గుర్తింపు, భద్రత వంటి అంశాలను ఉగ్ర సంస్థలు ప్రచార సాధనాలుగా ఉపయోగిస్తున్నాయని ఐరాస నివేదిక పేర్కొంది.

మరోవైపు అబ్బాయిలను హింస ద్వారానే శక్తి, గౌరవం సాధించవచ్చనే భావనతో రెచ్చగొడుతున్నాయని తెలిపింది.

ఇలా వేర్వేరు వర్గాల మానసిక అవసరాలను గుర్తించి, అందుకు తగ్గట్టుగా ప్రచార సందేశాలను రూపొందించడం ఉగ్ర సంస్థల వ్యూహంలో కీలకంగా మారిందని వివరించింది.

ADVERTISEMENT

వివరాలు 

దక్షిణ భారత్‌లో ఏఐ ప్రచార నమూనా

ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఐసిస్ ఈ ఏఐ ఆధారిత ప్రచార నమూనాను సమర్థంగా ఉపయోగిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

ఈ ప్రచారం ద్వారా తీవ్రవాద భావజాలానికి ప్రభావితమైన వ్యక్తులు వెంటనే హింసాత్మక దాడులకు పాల్పడకుండా, బయటకు సాధారణంగానే కనిపిస్తూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

దీంతో వారిని ముందుగానే గుర్తించడం భద్రతా సంస్థలకు సవాలుగా మారుతోందని పేర్కొంటున్నారు.

వివరాలు 

ఇతర ఉగ్ర సంస్థలకూ వ్యూహం విస్తరించే ప్రమాదం

భవిష్యత్తులో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా ఏఐ ఆధారిత ప్రచార వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాంకేతికతను ఉపయోగించుకుని భావజాల వ్యాప్తి, రాడికలైజేషన్‌ను విస్తరించే ప్రయత్నాలు పెరిగితే.. యువత, మహిళలు, చిన్నారుల భద్రతపై మరింత అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు.

ADVERTISEMENT