
Israel - Hamas war: ఉత్తర గాజాలో హమాస్ కమాండ్ వ్యవస్థను నాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ చేపడుతోంది.
తాజాగా ఉత్తర గాజా స్ట్రిప్‌లోని హమాస్ కమాండ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) పేర్కొంది.
ఉత్తర గాజాలో హమాస్ మిలిటెంట్లు కమాండర్లు లేకుండా పోరాడుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
ఇప్పుడు ఇజ్రాయెల్ బలగాలు గాజా సిటీ, దక్షిణ గాజాపై దృష్టి సారించినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి హగారి తెలిపారు.
దక్షిణ గాజాలో లక్ష్యాలను సాధించడానికి మరికొంత సమయం పడుతుందన్నారు.
దక్షిణ గాజాలో శరణార్థి శిబిరాలు, ఉగ్రవాదులతో నిండి ఉంటాయని, అలాగే ఈ ప్రాంతం నుంచి ఖాన్ యునిస్‌కు విస్తృతమైన భూగర్భ సొరంగాల నెట్‌వర్క్ ఉంది.
దీన్ని నాశనం చేయడానికి సమయం పడుతుందని హగారి పేర్కొన్నారు.
గాజా
హమాస్‌ను పూర్తిగా నాశనం చేసే వరకు యుద్ధం ఆగదు: ప్రధాని నెతన్యాహు
హమాస్‌ను పూర్తిగా నిర్మూలించాలని, బందీలుగా ఉన్న వారందరికీ సురక్షితమైన ఇల్లు ఉండేలా చూడాలని ఇజ్రాయెల్ మిలటరీని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
హమాస్‌పై యుద్ధం లక్ష్యాలన్నింటినీ సాధించే వరకు ఆగకూడదని దిశానిర్దేశం చేశారు.
ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్, గాజా మధ్య కొనసాగుతున్న వివాదం మధ్యప్రాచ్య దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉంది.
ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, గ్రీక్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో సమావేశమయ్యారు.
ఈ వివాదం మధ్యప్రాచ్యానికి వ్యాపించకుండా చూసుకోవాలని వారిని బ్లింకెన్ కోరారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ప్రారంభం కాగా.. ఈ పోరాటంలో ఇప్పటివరకు 22,722 మంది మరణించారు.