Israel: గాజాలోని అతిపెద్ద ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి.. ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఉన్న నాసర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్ ఆధ్వర్యంలోని పౌర రక్షణ విభాగం అధికారి వెల్లడించారు. గురువారం ఆసుపత్రిలోని శస్త్రచికిత్స విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలో మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఆసుపత్రి భవనం కూడా తీవ్రంగా దెబ్బతింది. మృతుల్లో ఒక సర్జన్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ సైన్యం వెంటనే స్పందించలేదు.
వివరాలు
నాసర్ ఆసుపత్రిపై గతంలోనూ ఇజ్రాయెల్ దాడులు
దక్షిణ గాజాలోనే అతిపెద్ద వైద్య కేంద్రంగా ఉన్న నాసర్ ఆసుపత్రిపై గతంలోనూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి.
2025 ఆగస్టులో ఈ ఆసుపత్రిపై రెండుసార్లు దాడులు జరగడంతో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో పలువురు జర్నలిస్టులు, వైద్య సిబ్బంది కూడా ఉన్నారు.
అప్పట్లో ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందించింది.
ఇది దురదృష్టకరమైన పొరపాటుగా పేర్కొంటూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
వివరాలు
కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా కొనసాగుతున్న దాడులు
గత ఏడాది అక్టోబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ గాజాలో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు.
అప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో 1,600 మందికి పైగా మరణించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాల్పుల విరమణ నిబంధనలను పరస్పరం ఉల్లంఘిస్తున్నాయని ఇజ్రాయెల్, హమాస్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాల్లోకి నీరు చేరింది. దీంతో అక్కడి ప్రజల కష్టాలు మరింత పెరిగాయి.
వివరాలు
గాజాలో 74 వేల మందికి పైగా మృతి
2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ నేతృత్వంలో జరిగిన దాడితో గాజా యుద్ధం ప్రారంభమైంది.
ఈ దాడిలో సుమారు 1,200 మంది ప్రాణాలు కోల్పోగా, 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు.
అప్పటి నుంచి గాజాలో 74,645 మందికి పైగా మరణించినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గురువారం దాడికి ముందు మంగళవారం కూడా గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ బలగాల దాడుల్లో ఏడుగురు మరణించారు.
వీరిలో 13 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అయితే తాము సైనిక కార్యకలాపాల్లో పాల్గొన్న వారినే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.