BRI Exit Italy: జీ20 వేదికగా చైనాకు షాకిచ్చిన ఇటలీ
దిల్లీ జీ20 వేదికగా చైనాకు ఇటలీ షాకిచ్చింది. చైనా ప్రతిష్టాత్మికంగా భావించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) నుంచి తాము వైదొలగాలని భావిస్తున్నట్లు ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ప్రకటించారు. చైనా ప్రధాని లీ కియాంగ్‌కు ఈ విషయాన్ని జార్జియా చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. దిల్లీలో జీ20 సందర్భంగా శనివారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని- చైనా ప్రధాని లీ కియాంగ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా తాము BRI నుంచి నిష్క్రమించాలన్న ఆలోచనను జార్జియా వ్యక్తం చేశారు. చైనాతో బీఆర్ఐ ఒప్పందాన్ని రద్దు ఇటలీలోని రాజకీయ పార్టీలు డిమాండ్ నేపథ్యంలో ప్రధాని జార్జియా మెలోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
BRI వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదు: ఇటలీ ప్రధాని జార్జియా
మౌలిక సదుపాయాల కల్పన కోసం చైనా BRIను ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో చేరిన దేశాల్లో మౌలిక సదుపాయాలకు కల్పిస్తామని చైనా చెప్పింది. చైనా సారథ్యంలో నడుస్తున్న BRI వల్ల తమకు ఎటువంటి ప్రయోజనాలను చేకూరలేదని జార్జియా మెలోని స్పష్టం చేశారు. అయితే బీజింగ్‌తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని చూస్తున్నట్లు మెలోని చెప్పారు. 2019లో ఇటలీ అధికారికంగా బీఆర్ఐ ఒప్పందంపై సంతకం చేసింది. సెప్టెంబరు 5న బీజింగ్‌ను సందర్శించిన ఇటాలియన్ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ, బీఆర్ఐపై విమర్శలు గుప్పించారు. ఇది తాము ఊహించిన ఫలితాలను తీసుకురాలేదని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో బీజింగ్‌లో బీఆర్ఐ మూడో సమావేశాన్ని నిర్వహించాలని చైనా ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఇటలీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.