Artemis II astronauts: 'చంద్రునిపై ప్రేమకు గుర్తు': భార్య పేరుతో బిలానికి నామకరణం కోరిన వ్యోమగామి
ఈ వార్తాకథనం ఏంటి
నిండైన పౌర్ణమి రాత్రుల్లో వెండి వెన్నెల కురిసే వేళ ప్రేమికులు పంచుకునే అనుభూతులు ఎన్నో. ఆదూరంలోని చందమామను సాక్షిగా చేసుకొని ప్రేమలో మునిగిపోయిన జంటలు ఆలపించిన మధుర గీతాలు ఎన్నో సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు ఆ ప్రేమ భావనే అంతరిక్షాన్ని తాకింది.భూమిని విడిచి చంద్రుని చేరుకున్న వ్యోమగాముల హృదయాల్లో కూడా అదే అనురాగం ఉప్పొంగింది. కఠినమైన రక్షణ దుస్తుల వెనుక దాగి ఉన్న మనసుల్లో ప్రేమ ప్రతిధ్వనించింది. చంద్రునిపై తాజాగా గుర్తించిన ఒక బిలానికి తన మరణించిన భార్య క్యారల్ పేరు పెట్టాలని ఆర్టెమిస్-2 యాత్రాధికారి రీడ్ వైస్‌మాన్ కోరడం ఈ భావోద్వేగానికి ఉదాహరణగా నిలిచింది. క్యాన్సర్ వ్యాధితో 2020లో కన్నుమూసిన భార్యను తలుచుకుంటూ ఆయన భావోద్వేగంతో మాటలు ఆపుకోలేకపోయారు.
వివరాలు
బిలం సుమారు ఐదు కిలోమీటర్ల వెడల్పు
దీంతో ఆయన తరఫున మరో వ్యోమగామి జెరీమీ హాన్సన్ యాత్ర నియంత్రణ కేంద్రానికి ఈ అభ్యర్థనను తెలియజేశారు. ఈ ఘటన మొత్తం యాత్రలో అత్యంత మధుర క్షణంగా వైస్‌మాన్ తర్వాత పేర్కొన్నారు. ప్రతిపాదించిన ఈ బిలం సుమారు ఐదు కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఇది భూమి నుంచి కనిపించే చంద్రభాగం, కనిపించని మరో భాగం మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉంది. భూమికి తిరిగి వచ్చిన తరువాత యాత్రికులు తమ ప్రతిపాదనలను అంతర్జాతీయ ఖగోళ సంఘానికి సమర్పించనున్నారు. ఖగోళ వస్తువులకు అధికారికంగా పేర్లు నిర్ణయించే బాధ్యత ఈ సంస్థదే.
వివరాలు
చంద్రునిపై భాగాలకు జీవిత భాగస్వాముల పేర్లు
చంద్రునిపై భాగాలకు జీవిత భాగస్వాముల పేర్లు పెట్టడం ఇదే తొలిసారి కాదు. 1968లో జరిగిన అపోలో-8యాత్రలో వ్యోమగామి జిమ్ లోవెల్ చంద్రుడిపై ఒక పర్వతానికి తన భార్య పేరు మేర్లిన్ పేరిట నామకరణం చేశారు. చంద్రుని సమీపానికి మానవులు తొలిసారి వెళ్లిన ఆ యాత్రలో ఆయన తన భార్యపై ప్రేమను ఇలా చిరస్మరణీయం చేశారు. అయితే ఆ పేరుకు అధికారిక ఆమోదం రావడానికి దాదాపు యాభైసంవత్సరాలు పట్టింది. 2017లో అంతర్జాతీయ ఖగోళసంఘం దానికి ఆమోదం తెలిపింది. క్యారల్ పేరుపై నిర్ణయం నెలరోజుల్లో తీసుకుంటామని సంఘ ప్రతినిధి రామస్వామి వేణుగోపాల్ తెలిపారు. మరో బిలానికి ఆర్టెమిస్-2 యాత్రికులు తమ వ్యోమనౌక'ఇంటెగ్రిటీ'పేరు సూచించారు. చంద్రునికి సంబంధించిన యాత్రికులు ప్రతిపాదించిన 81పేర్లకు ఇప్పటికే సంఘం ఆమోదం తెలిపింది.