Brazil Election Results: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా చారిత్రాత్మక విజయం.. నాలుగోసారి అధికార పగ్గాలు
ఈ వార్తాకథనం ఏంటి
లాటిన్ అమెరికాలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన బ్రెజిల్లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రాజకీయంగా కీలక పరిణామానికి దారితీశాయి. హోరాహోరీగా సాగిన రెండో విడత ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు,వామపక్ష నాయకుడు లూయిస్ ఇనాసియో లూలా దా సిల్వా విజయం సాధించారు. మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కుమారుడు,సెనేటర్ ఫ్లావియో బోల్సోనారోపై ఆధిక్యం సాధించి మరోసారి దేశ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి ఎన్నికైన నాయకుడిగా లూలా చరిత్ర సృష్టించారు. అక్టోబర్ 25న జరిగిన రెండో విడత పోలింగ్‌లో లూలాకు 51.8శాతం ఓట్లు రాగా,ఫ్లావియో బోల్సోనారోకు 48.2శాతం ఓట్లు లభించాయి. ఇద్దరి మధ్య దాదాపు 44 లక్షల ఓట్ల తేడా నమోదైంది. ఈ ఫలితాలను బ్రెజిల్ సుపీరియర్ ఎలక్టోరల్ కోర్టు ధ్రువీకరించింది.
వివరాలు
మొదటి విడతలో వెనుకబడి.. రెండో విడతలో విజయం
బ్రెజిల్లో 1980లలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించిన తర్వాత, మొదటి విడత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థి రెండో విడతలో గెలిచి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే తొలిసారి.
అక్టోబర్ 4న జరిగిన తొలి విడత పోలింగ్‌లో ఫ్లావియో బోల్సోనారో 47.03శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా, లూలాకు 45.16 శాతం ఓట్లు వచ్చాయి.
దీంతో తుది పోరు రెండో విడతకు చేరింది. తొలి విడత ఫలితాల తర్వాత లూలా తన ప్రచార వ్యూహాన్ని మార్చుకున్నారు.
ప్రత్యర్థి బోల్సోనారోకు మరోసారి అధికారం దక్కకూడదనే సందేశంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
భారీ బహిరంగ సభలు నిర్వహించడంతోపాటు సోషల్ మీడియా ద్వారా ఓటర్లను చేరుకునేందుకు ప్రయత్నించారు.
సంక్షేమ పథకాల కొనసాగింపు, ప్రజా రవాణాకు సంబంధించిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
వివరాలు
వీధుల్లో లూలా మద్దతుదారుల సంబరాలు
ఈ ప్రచారంతో రెండో విడతలో ఓటర్ల మద్దతును కూడగట్టుకుని విజయాన్ని అందుకున్నారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత సావో పాలోతోపాటు బ్రెజిల్‌లోని పలు ప్రధాన నగరాల్లో లూలా మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
కార్మిక ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన లూలా గతంలో 2003 నుంచి 2010 వరకు రెండు పర్యాయాలు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆ తర్వాత ఆయనపై నమోదైన అవినీతి కేసుల్లో శిక్షలు పడటంతో జైలుకు వెళ్లారు.
అయితే, సంబంధిత కోర్టు తీర్పులు రద్దు కావడంతో ఆయన తిరిగి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించే అవకాశం లభించింది.
2023లో మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.ఆయన గత పాలనలో సంక్షేమ పథకాల విస్తరణ,పేదరిక నిర్మూలనకు తీసుకున్న చర్యలు ప్రజల్లో ఆదరణ పొందాయి.
వివరాలు
ప్రతిపక్షాల ఆధిపత్యంలో పార్లమెంట్.. లూలాకు సవాళ్లు
ప్రస్తుత పాలనలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలో నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లూలా రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టంగా నిలిచింది.
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, తదుపరి పాలనలో లూలాకు అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
బ్రెజిల్ పార్లమెంట్లో సంప్రదాయవాద, మితవాద పార్టీలకు గణనీయమైన ప్రాతినిధ్యం ఉండటంతో ప్రభుత్వ విధానాలకు ఆమోదం పొందడం అంత సులభం కాకపోవచ్చు.
జైర్ బోల్సోనారోకు చెందిన లిబరల్ పార్టీతోపాటు దాని మిత్రపక్షాలు పార్లమెంటులో బలంగా ఉండటంతో కీలక నిర్ణయాల అమలులో రాజకీయ చర్చలు, సంప్రదింపులు అవసరం కానున్నాయి.
వివరాలు
ప్రతిపక్షాల ఆధిపత్యంలో పార్లమెంట్.. లూలాకు సవాళ్లు
దీనికి తోడు దేశ ఆర్థిక లోటు, పెరుగుతున్న జీవన వ్యయం, ప్రభుత్వ రుణభారం, రాజకీయ పార్టీల మధ్య తీవ్ర విభేదాలు లూలా ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.
సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం ఆయనకు కీలకం కానుంది.
మరోవైపు, లాటిన్ అమెరికాలో మితవాద, రైట్‌వింగ్ రాజకీయ శక్తుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లూలా విజయం ప్రాంతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తంగా, నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన లూలా ప్రజల ఆశలను నెరవేర్చడంతోపాటు పార్లమెంటులోని రాజకీయ విభేదాలను అధిగమించి పాలన సాగించాల్సి ఉంటుంది.