Nicolas Maduro: అమెరికా కస్టడీలో మదురో.. న్యూయార్క్ కోర్టులో రెండోసారి హాజరు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మరోసారి న్యూయార్క్ కోర్టులో హాజరయ్యారు. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో కరాకస్‌లోని ఆయన నివాసంపై అమెరికా దళాలు దాడి చేసి మదురోను బలవంతంగా పట్టుకెళ్లిన విషయం తెలిసిందే. జనవరి 5న జరిగిన తొలి విచారణలో తనపై నమోదైన డ్రగ్ ట్రాఫికింగ్ సహా అన్ని ఆరోపణలను మదురో ఖండించారు. తాను కరాకస్ నుంచి కిడ్నాప్ చేయబడ్డానని, ఇప్పటికీ వెనిజులా చట్టబద్ధ అధ్యక్షుడినేనని కోర్టుకు స్పష్టం చేశారు. తాజాగా గురువారం జరిగిన విచారణలో మదురో తరఫు న్యాయవాది కేసును పూర్తిగా కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు.
వివరాలు
రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే
మదురో తన న్యాయ పోరాటానికి అవసరమైన ఖర్చుల కోసం వెనిజులా ప్రభుత్వ నిధులను వినియోగించకుండా అమెరికా అడ్డుకోవడం ఆయన రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని వాదించారు. అయితే ఈ వాదనలను కోర్టు అంగీకరించకుండా కేసును కొనసాగించాలని నిర్ణయించింది. జనవరి 3న అమెరికా సైన్యం వెనిజులాపై భారీ స్థాయిలో దాడి జరిపి, మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌ను కూడా అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించింది.
వివరాలు
కోర్టు వెలుపల నిరసనలు
ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఈ దంపతులను న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ప్రాంతంలో ఉన్న మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచినట్లు సమాచారం. ఇక కోర్టు వెలుపల నిరసనలు కూడా ఉధృతమయ్యాయి. పెద్ద సంఖ్యలో గుమికూడిన నిరసనకారులు మదురోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. "ఎన్నికైన దేశాధినేతను కిడ్నాప్ చేసే హక్కు అమెరికాకు లేదు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.