Earthquake: టిబెట్‌లో 5.3 తీవ్రతతో భూకంపం.. నేపాల్‌లోనూ ప్రకంపనలు
ఈ వార్తాకథనం ఏంటి
వరదల బీభత్సం నుంచి ఇంకా కోలుకోని నేపాల్‌ను తాజాగా భూకంపం కుదిపేసింది. దేశంలోని వాయువ్య ప్రాంతమైన ముస్తాంగ్ జిల్లాలో మంగళవారం రాత్రి 5.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు సమీపంలోని మనాంగ్, డోల్పా, మ్యాగ్దీ జిల్లాల్లోనూ కనిపించాయి. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం అధికారిక సమాచారం ప్రకారం.. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.38 గంటలకు భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. వాయువ్య నేపాల్‌లో 29.022 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83.978 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి ఉపరితలానికి 143 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
వివరాలు
ముస్తాంగ్ జిల్లాలోని లోమంథాంగ్ కేంద్రంగా భూకంపం
భూకంప కేంద్రం భూమిలోపల చాలా లోతుగా ఉండటంతో ఉపరితలంపై దాని ప్రభావం పరిమితంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ స్థాయిలో నిర్మాణాలకు నష్టం జరిగినట్లు సమాచారం లేదని తెలిపారు.
పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం సమాచారం ప్రకారం.. రాత్రి 9.53 గంటలకు నమోదైన ఈ భూకంపానికి ముస్తాంగ్ జిల్లాలోని లోమంథాంగ్ కేంద్రంగా ఉన్నట్లు వెల్లడైంది.
ఈ ప్రాంతం నేపాల్ రాజధాని ఖాట్మండుకు వాయువ్య దిశలో సుమారు 375 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వివరాలు
వరదలతో తీవ్ర సంక్షోభం..
గత నెలలో భోటే కోషి నదికి ఆకస్మికంగా వచ్చిన వరదలతో నేపాల్ తీవ్ర విపత్తును ఎదుర్కొంది.
ఈ ఘటనలో 1,357 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక, గాలింపు చర్యలు 14వ రోజుకు చేరుకున్నాయి.
రాయిటర్స్ అంచనా ప్రకారం.. వరదల కారణంగా నేపాల్‌కు ప్రత్యక్షంగా సుమారు 256 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది.
ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం,దీర్ఘకాలిక పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని కలిపితే ఈ నష్టం 400 కోట్ల నుంచి 700 కోట్ల డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
నేపాల్ పోలీసుల వివరాల ప్రకారం.. వరదల్లో ఇప్పటివరకు 1,366 మంది మృతిచెందగా, మరో 4,077 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
వివరాలు
సహాయక చర్యల్లో భారత్..
ఇప్పటివరకు 533 మంది పురుషులు, 339 మంది మహిళల మృతదేహాలను వెలికితీశారు. వాటిలో 102 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
విపత్తుతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్‌కు భారత్ సహాయక చర్యల్లో అండగా నిలుస్తోంది.
చిలిమే సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలు, బురదను తొలగించేందుకు భారత్, నేపాల్‌కు చెందిన బృందాలు కలిసి పనిచేస్తున్నాయని నేపాల్‌లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు.
వాలుగా ఉన్న సొరంగంలో రాకపోకలు సాగించేందుకు హెచ్‌డీపీఈ పైపులను వినియోగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అలాగే స్యాఫ్రుబేసి నుంచి సొరంగ ద్వారం వరకు తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసేందుకు నియంత్రిత పేలుళ్లను ఉపయోగిస్తూ పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.