Fire at military base: కెనడా సైనిక స్థావరంలో భారీ అగ్నిప్రమాదం.. పలువురు మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలోని అల్బెర్టా ప్రావిన్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ఓ సైనిక స్థావరంలో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడినట్లు ఆ దేశ రక్షణ మంత్రి డేవిడ్ మెక్గింటీ (David McGuinty) వెల్లడించారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్యతో పాటు గాయపడినవారి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అల్బెర్టా ప్రావిన్సులోని వైన్రైట్ సమీపంలో ఉన్న కెనడియన్ ఫోర్సెస్ బేస్ వైన్రైట్ (CFB Wainwright)లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) అంతకుముందు సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు.
వివరాలు
అధికారులు జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలి
ఈ ఘటనతో ప్రభావితమైన సైనిక సిబ్బందికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
మరోవైపు ప్రమాదం నేపథ్యంలో స్థానికులు అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని రక్షణ మంత్రి డేవిడ్ మెక్గింటీ కోరారు.
సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా రహదారులను ఖాళీగా ఉంచాలని సూచించారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.