Loading...
Muizzu: 11 ఏళ్ల తర్వాత పాక్‌లో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు పర్యటన
11 ఏళ్ల తర్వాత పాక్‌లో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు పర్యటన

Muizzu: 11 ఏళ్ల తర్వాత పాక్‌లో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు పర్యటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అక్టోబర్ 20 నుంచి 22 వరకు పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. 11 ఏళ్ల తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆహ్వానం మేరకు ముయిజ్జు మూడు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ఆదివారం వెల్లడించింది. 1966లో పాకిస్థాన్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ పర్యటనలో ముయిజ్జుతో పాటు ఆయన భార్య సజిదా మొహమ్మద్, మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ప్రతినిధి బృందం పాల్గొననుంది.

వివరాలు 

వాణిజ్యం, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చలు

పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో ముయిజ్జు భేటీ కానున్నారు. ఆయన గౌరవార్థం జర్దారీ ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు.

అలాగే ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో విడిగా, ప్రతినిధి బృందాల స్థాయిలోనూ చర్చలు జరపనున్నారు.

ఈ సమావేశాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్రంగా చర్చించనున్నారు.

ముఖ్యంగా వాణిజ్యం,పెట్టుబడులు,వైద్యం,విద్య,పర్యాటకం,వ్యవసాయం,రక్షణ,సముద్ర భద్రత,వాతావరణ మార్పులు వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకునే అంశాలపై దృష్టి సారించనున్నారు.

ప్రజల మధ్య పరస్పర సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

వివరాలు 

పలు ఒప్పందాలకు అవకాశం

ఈ పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌-మాల్దీవుల వ్యాపార వేదికను కూడా నిర్వహించనున్నారు.

ఇరు దేశాల వ్యాపార వర్గాల మధ్య సంబంధాలను పెంచడం, వాణిజ్యం, పెట్టుబడులకు కొత్త అవకాశాలను గుర్తించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై పలు ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.

ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు పరస్పర ప్రయోజనాలను అందించే కొత్త రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని పేర్కొంది.

ADVERTISEMENT