Indians in China: చైనా సోషల్ మీడియాలో భారత్‌పై విషప్రచారం.. ప్రవాస భారతీయుల ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా భారత్‌కు వ్యతిరేకంగా అక్కడి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం, భారత నిపుణులకు వర్క్ వీసాల మంజూరులో ఇబ్బందులు, జీవిత భాగస్వాముల ఉపాధిపై ఆంక్షలు వంటి అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలను చైనాలోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రవాస భారతీయుల సమస్యలను తెలుసుకునేందుకు భారత రాయబార కార్యాలయం కొన్నేళ్ల విరామం తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించింది. భారత రాయబారి విక్రమ్ దొరైస్వామితో పాటు మరో ఇద్దరు కాన్సులర్ అధికారులు ప్రవాసులతో సమావేశమై వారి సమస్యలను విన్నారు.
వివరాలు
సమస్య పరిష్కారానికి చర్యలు
ఈ సందర్భంగా భారతీయుల ఆహార అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అవమానకరమైన కంటెంట్ పెరుగుతోందని ప్రవాసులు తెలిపారు.
అంతేకాకుండా భారత నిపుణులకు చైనా పరిమిత సంఖ్యలోనే ఉద్యోగ వీసాలు జారీ చేస్తోందని, కాన్సులర్ సేవల విషయంలోనూ పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వివరించారు.
జీవిత భాగస్వాముల ఉపాధికి సంబంధించిన పరిమితులు కూడా తమపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
ఈ అంశాలపై స్పందించిన రాయబారి విక్రమ్ దొరైస్వామి.. భారత్ వ్యతిరేక కంటెంట్ పెరుగుతున్న విషయంపై చైనా ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
వివరాలు
తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికల ద్వారా వాస్తవాల ఆధారిత సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తోందని తెలిపారు.
అలాగే భారతీయుల విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాల వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని రాయబారి హామీ ఇచ్చారు.