Zohran Mamdani: న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ.. ఖురాన్‌పై ప్రమాణం చేస్తూ సరికొత్త చరిత్ర!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అత్యంత విస్తీర్ణం కలిగిన నగరమైన న్యూయార్క్‌కు కొత్త మేయర్‌గా 34 ఏళ్ల యువ డెమొక్రాట్ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ బాధ్యతలు చేపట్టారు. నూతన సంవత్సరం 2026 ప్రారంభమైన తొలి క్షణాల్లోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. న్యూయార్క్ నగర చరిత్రలో పవిత్ర ఖురాన్‌పై ప్రమాణం చేసిన తొలి మేయర్‌గా మమ్దానీ నిలిచారు. అంతేకాదు, ఈ కీలక పదవిని అధిష్ఠించిన మొదటి ముస్లిం,దక్షిణాసియా వాసి, ఆఫ్రికన్ వంశానికి చెందిన వ్యక్తిగా కూడా ఆయన రికార్డులు సృష్టించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మమ్దానీ సాంప్రదాయాలకు భిన్నంగా నిర్వహించారు. 1945 నుంచి మూసివేసి ఉన్న మన్హటన్‌లోని చారిత్రక 'ఓల్డ్ సిటీ హాల్ సబ్‌వే స్టేషన్'ను ఈ వేడుకకు వేదికగా ఎంచుకున్నారు.
వివరాలు
ప్రమాణ స్వీకారానికి మూడు పవిత్ర ఖురాన్ ప్రతుల వినియోగం
"ఈ నగరాన్ని ముందుకు నడిపించే కార్మిక వర్గానికి నా గౌరవాన్ని చాటేందుకు ఇదే సరైన స్థలం" అని ఆయన వ్యాఖ్యానించారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ సమక్షంలో, కుటుంబ సభ్యుల మధ్య మమ్దానీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ చారిత్రక ప్రమాణ స్వీకారంలో మమ్దానీ మూడు పవిత్ర ఖురాన్ ప్రతులను ఉపయోగించడం విశేషం. అందులో ఒకటి ఆయన తాతగారికి చెందినది కాగా, రెండోది 18వ శతాబ్దానికి చెందిన అరుదైన ఖురాన్ ప్రతి. నల్లజాతీయుల చరిత్రను ప్రతిబింబించే ఈ ప్రతిని అర్టురో షోంబర్గ్ సేకరించారు. మూడవది ఆయన నానమ్మకు చెందిన ఖురాన్ ప్రతి కావడం మరో ప్రత్యేకత.
వివరాలు
బ్రాడ్‌వే వీధుల్లో వేలాది మందితో భారీగా 'బ్లాక్ పార్టీ'
అర్ధరాత్రి జరిగిన ఈ ప్రైవేట్ కార్యక్రమం అనంతరం, నేటి (జనవరి 1) మధ్యాహ్నం 1 గంటలకు సిటీ హాల్ మెట్లపై బహిరంగ ప్రమాణ స్వీకార వేడుక జరగనుంది. ఈ కార్యక్రమంలో మమ్దానీకి రాజకీయ మార్గదర్శకుడిగా భావించే సెనేటర్ బెర్నీ సాండర్స్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. యువ నాయకురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ ప్రారంభ ప్రసంగం చేయనున్నారు. అదే సమయంలో బ్రాడ్‌వే వీధుల్లో వేలాది మందితో భారీగా 'బ్లాక్ పార్టీ' నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.