LOADING...
Iran: ఖమేనీ అంతిమయాత్రలో లక్షలాది ప్రజలు.. ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు
ఖమేనీ అంతిమయాత్రలో లక్షలాది ప్రజలు.. ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు

Iran: ఖమేనీ అంతిమయాత్రలో లక్షలాది ప్రజలు.. ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై దేశవ్యాప్తంగా తీవ్ర భావోద్వేగాలు వ్యక్తమవుతున్నాయి. ఖమేనీ మరణానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంపే కారణమని ఆరోపిస్తూ పెద్దఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనకు తగిన శిక్ష పడాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులో నల్లని దుస్తులు ధరించిన వేలాది మంది ప్రజలు పిడికిలి బిగించి నినాదాలు చేశారు. టెహ్రాన్‌ నగరంలోని ప్రధాన వీధులన్నీ జనసందోహంతో నిండిపోయాయి. కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరిన దృశ్యాలను ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఖమేనీ పార్థివదేహంతో పాటు ఆయన కుటుంబసభ్యుల మృతదేహాల శవపేటికలను ఒక ప్రత్యేక వాహనంలో ఉంచి ప్రజల సందర్శనకు అవకాశం కల్పించారు.

వివరాలు 

ట్రంప్‌ దిష్టిబొమ్మల ప్రదర్శన 

ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సర్వోన్నత నేతకు తుది వీడ్కోలు పలుకుతున్నారు. ఇంతకు ముందు 2020లో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ జనరల్‌ ఖాసెం సొలెమని అంత్యక్రియల ఊరేగింపులో దాదాపు 10 లక్షల మందికిపైగా పాల్గొనడం రికార్డుగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఖమేనీ అంత్యక్రియలకు అంతకంటే ఎక్కువ మంది హాజరవుతున్నట్లు కనిపిస్తోందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ఊరేగింపులో పాల్గొన్న పలువురు ట్రంప్‌ దిష్టిబొమ్మలను ప్రదర్శిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు నిరసనకారులు నినాద ఫలకాలు, బ్యానర్లు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. మరికొందరు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై కూడా వ్యతిరేక నినాదాలు చేశారు.

వివరాలు 

భారత్‌కు కృతజ్ఞతలు

ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా భారత్‌ ప్రదర్శించిన మిత్రభావం, సానుభూతి, హృదయపూర్వక గౌరవానికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని ఇరాన్‌ దౌత్య కార్యాలయం పేర్కొంది. అంత్యక్రియల్లో పాల్గొన్న భారతీయ సమాజానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ హాజరు ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, స్నేహబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఇరాన్‌ దౌత్య కార్యాలయం వెల్లడించింది.

Advertisement